ఉత్తమ్ పట్టు.. రేవంత్ బెట్టు!

తెలంగాణ కాంగ్రెస్లో అనుకున్నదే జరుగుతోంది. టికెట్ల కోసం నేతల మధ్య వార్ అంతకంతకూ పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టికెట్లు ఆశించే నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక వీటిని వడబోసేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిద్ధమైంది. మొదటి సమావేశం కూడా నిర్వహించింది. కానీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. సీటుకు ముగ్గురి చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసి.. స్క్రీనింగ్ కమిటీకి అందజేసి చర్చిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి పంపిస్తారు. కానీ ఇక్కడ మొదటి దశలోనే గొడవ మొదలైనట్లు తెలిసింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మరోసారి వాగ్వాదం జరిగిందని సమాచారం.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి తాను, కోదాడ నుంచి భార్య పద్మావతి పోటీ చేస్తుందని ఇప్పటికే ఉత్తమ్ ప్రకటించేశారు. ఈ మేరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమని తెలుస్తోంది. ఈ విషయంలోనే తాజాగా రేవంత్, ఉత్తమ్ మధ్య వాగ్వాదం జరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు అనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్కు ఉత్తమ్ చెప్పినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా ఆ పని చేయాలని సూచించారని టాక్.

కానీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలని తాను ఎప్పటికీ అధిష్ఠానానికి చెప్పేదే లేదని రేవంత్ తెగేసి చెప్పారని సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానానిదే నిర్ణయమని రేవంత్ అన్నట్లు తెలిసింది. ఏ విషయంలోనూ తనను డిక్టేట్ చేయొద్దని ఉత్తమ్కు రేవంత్ గట్టిగానే చెప్పారని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీంతో ఈ సమావేశంలో అభ్యర్థులపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోసారి సెప్టెంబర్ 2న సమావేశం కావాలని నిర్ణయించారు. మరి ముందు ముందు కాంగ్రెస్లో టికెట్ల కోసం ఇంకా ఎలాంటి పోట్లాటలు జరుగుతాయో చూడాలి.