టార్గెట్ సోనియా?

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఓడించేందుకు బీజేపీ ఇప్పటినుండే వ్యూహం రచిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి పార్లమెంటు స్ధానం నుండి సోనియా అప్రతిహతంగా గెలుస్తునే ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గంలో సోనియాను ఓడించేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేయబోతోంది. బీజేపీ తరపున పోటీచేయించబోయే అభ్యర్ధికోసం గట్టిగా గాలిస్తోంది. ఒక్క సోనియా అనే కాదు ప్రతిపక్షాల్లోని గట్టి అభ్యర్ధులు ఎవరు అనే విషయమై చర్చించేందుకు బీజేపీ ఒక సమావేశం నిర్వహించింది.

బీజేపీ చీఫ్ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం అచ్చంగా ప్రతిపక్షాల్లో బలమైన నేతలు, అభ్యర్ధులు ఎవరు అన్న విషయంపైనే చర్చ జరిగింది. అందులో సోనియా గాంధి, సుప్రియా సూలే, దింపుల్ యాదవ్ లాంటి నేతల జాబితాను రెడీ చేసింది. బీజేపీ తయారుచేసిన జాబితా ప్రకారం ప్రతిపక్షాల్లో సుమారు 160 మంది బలమైన నేతలున్నట్లు తేలింది. వీళ్ళందరినీ ఓడించేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకమైన యూనిట్ గా నిర్ణయించింది.

అంటే ఏ నియోజకవర్గానికి అవసరమైన వ్యూహాలను అక్కడ అమలుచేయటమే ముఖ్య ఉద్దేశ్యం. 2006 నుండి 2019 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో సోనియా నామినేషన్ వేస్తే చాలు గెలిచిపోతున్నారు. అలాగే బారామతి నియోజకవర్గంలో సుప్రియాసూలే కూడా 2009, 14,19 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. అలాగే మొయిన్ పురి నియోజకవర్గంలో డింపుల్ యాదవ్ మొదటిసారి గెలిచారు. ఇలాంటి వాళ్ళని ఓడించితీరాలని  ప్రత్యేకంగా తీర్మానించారు.

బీజేపీ సమావేశం తీర్మానం వరకు బాగానే ఉందికానీ అసలు రాబోయే ఎన్నికల్లో సోనియా పోటీచేస్తారా అన్నదే అనుమానం. ఎందుకంటే దాదాపు 75 ఏళ్ళ వయసున్న సోనియా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందుకనే సోనియా జనాల్లోకి కూడా పెద్దగా రావటంలేదు. బహుశా వచ్చేఎన్నికల్లో సోనియాకు బదులుగా రాయ్ బరేలి నియోజకవర్గంలో ప్రియాంకగాంధి పోటీచేసే అవకాశాలను కొట్టిపారేసేందుకు లేదు. ఎందుకంటే ఇంతకాలం రాజకీయాల్లో తెరవెనుక పాత్రకు మాత్రమే పరిమితమైన ప్రియాంక ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి బీజేపీ టార్గెట్ సోనియా ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.