ఏపీకి హోదా మిస్సయింది ఆ ఐఏఎస్ వల్లే?ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై విభజన జరిగి దాదాపు పదేళ్ళు కావస్తున్నా ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో నిర్దాక్షిణ్యంగా ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ హోదా ఇస్తామని చెప్పింది. అదే విషయానికి బిజెపి కూడా వంత పాడింది. అయితే, ఆ తర్వాత అధికారాలు తారుమారైనప్పటికీ ఆ పార్టీలు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు కూడా. ఇటువంటి నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఒక ఐఏఎస్ అధికారి కారణమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
అంతేకాదు, ఆ అధికారి ఇప్పుడు ఏపీలో స్పెషల్ సీఎస్ గా పనిచేస్తున్నారని కూడా పివి రమేష్ బాంబు పేల్చారు. రాష్ట్ర విభజన సమయంలో విభజనానంతర అంశాలను తనతో పాటు రామకృష్ణారావు అనే మరో అధికారి పరిష్కరించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. విభజన సమయానికి అన్ని అంశాలకు పరిష్కారాలు కనుగొనాలన్న ఉద్దేశంతో అప్పట్లో రోజుకి 20 గంటల పాటు పనిచేశామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అప్పట్లోనే రావాల్సిందని, అది రాకపోవడానికి ఆ అధికారి కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఫిబ్రవరి 20న హోదాపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, మార్చి ఒకటో తేదీన కేబినెట్ ఆమోదించిందని గుర్తు చేసుకున్నారు.
అదే రోజున ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నోటిఫికేషన్ కూడా ఇచ్చారని మార్చి 5న ఆంధ్రప్రదేశ్ అపాయింట్మెంట్ డేట్ ను జూన్ రెండో తేదీగా నిర్ణయించారని చెప్పారు. అదే రోజున ఏపీకి ప్రత్యేక హోదా కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ ప్రణాళిక సంఘాన్ని కోరిందని గుర్తు చేసుకున్నారు. దానిపై ప్లానింగ్ కమిషన్ తో ఐదు సమావేశాలు పెట్టించానని, ఎన్నికల సమయం కాబట్టి ఆ విషయం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో స్వయంగా తానే రంగంలోకి దిగానని గుర్తు చేసుకున్నారు.
హోదా అంశాన్ని పూర్తి చేయాలని కోరుతూ ప్రణాళికా సంఘం కార్యదర్శిని తాను చాలాసార్లు కలిశానని రమేష్ అన్నారు. అయితే, ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రతినిధి ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేదని, ఆ శాఖలో ఆరోజు ఆ బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఏపీ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన, ఒక్క సమావేశానికి వచ్చి ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని గుర్తు చేసుకున్నారు. 2014 మే 16న ఎన్నికల ఫలితాలు వస్తాయని, ఆ తర్వాత ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు కాబట్టి అంతకు ముందు రోజైన మే 15న హోదాకు సంబంధించి చివరి మీటింగ్ పెట్టించానని గుర్తు చేసుకున్నారు.
ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే నోటిఫికేషన్ ఇచ్చేద్దామని ప్రణాళికా సంఘం కార్యదర్శి తనతో చెప్పిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు. ఆ కీలక మీటింగ్ కు ఆ పెద్దమనిషి డుమ్మా కొట్టారని, వేరే ఎవరినైనా పంపించి ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని అన్నారు. ఆ రోజు తెలంగాణ కేడర్ కావాలని కోరుకున్న ఆ పెద్దమనిషి ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఏపీకి వెళ్లారని గుర్తు చేసుకున్నారు.