పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో సానుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉండటంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలకు పార్టీ నాయకులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఖమ్మంలో సభలో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే ముద్ర పడకుండా ఉండేందుకు రాష్ట్రంలో ఎవరితో పొత్తులు లేవని ప్రకటించేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అంటూ మూడు పార్టీలను టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు ఓట్లు వేస్తే అవి బీఆర్ఎస్ కే చేరతాయని చెప్పి.. వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు అమిత్ షా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా బీజేపీ తెలంగాణ కీలక నాయకులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నాయకులకు మార్గనిర్దేశనం చేసినట్లు సమాచారం. అలాగే ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల్లో పరిస్థితి, పార్టీ ఎన్ని చోట్ల గెలుస్తుందనే అంచనాలు.. ఇలా తదితర విషయాల గురించి అమిత్ షా పూర్తిగా తెలుసుకున్నారని టాక్.

ఎలాగైనా తెలంగాణలో కేసీఆర్ను గద్దె దించి.. కాషాయ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గ ప్రణాళికల్లో మునిగిపోయింది. ముఖ్యంగా అమిత్ షా ఎన్నికలు జరిగేంతవరకూ ఇక్కడ పార్టీ అడుగులను వ్యక్తిగతంగా పర్యవేక్షించనున్నారని తెలిసింది. అందుకే ప్రతి పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తానని ఇక్కడి బీజేపీ నాయకులతో ఆయన చెప్పినట్లు తెలిసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేద్దామని అమిత్ షా చెప్పినట్లు టాక్.