ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేనలతోపాటు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ కు మొదటి నుంచి బీజేపీ అండ ఉందని, అందుకే ఆయన కేసులను కాపాడుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తును జగన్ తాకట్టు పెట్టారని వామపక్ష నేతలు గతంలో పలుమార్లు విమర్శలు గుప్పించారు. జగన్ నియంత పోకడల వల్ల రాష్ట్రం అప్పుల ఊభిలో కూరుకుపోయిందని వారు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ పై
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోడీకి దత్తపుత్రుడు జగన్ అని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్ పై బయట ఉండలేదని జగన్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఎన్నో కేసుల్లో జగన్ నిందితుడని, అయినా బెయిల్ పై ఉంటూ సీఎం అయ్యాడని విమర్శించారు. ఏపీలో వైసీపీ-బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రానికి జగన్ లొంగిపాయాడని, లిక్కర్ స్కామ్ నుంచి కవితను రక్షించేందుకు బీజేపీ తొత్తుగా కేసీఆర్ మారాడని షాకింగ్ కామెంట్లు చేశాడు. బీజేపీతో పవన్ అంటకాగుతున్నాడని, ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకమేనని చెప్పారు.
మరోవైపు, జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా విమర్శలు గుప్పించారు. వివేకా హత్య జరిగి నాలుగేళ్లయినా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదని విమర్శించారు. పులివెందులకు చిన్న పిల్లాడికి కూడా వివేకాను హత్య చేసింది ఎవరో తెలుసని, సీబీఐ మాత్రం విచారణ కొనసాగించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీల పొత్తు ఉంటే జగన్ నెత్తిమీద చంద్రబాబు పాలు పోసినట్లేనని అన్నారు. అలా కాకుండా బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates