ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ కూడా ఒక దాని మీద ఒక విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా నియమించిన పాలక మండలి పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు సభ్యుల నియామకం అనేది సరైన పద్ధతిలో జరగలేదని ఆయన దుయ్యబట్టారు. ”లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉండి..తరువాత అప్రూవర్ గా మారిన వ్యక్తి ఇప్పుడు మీకు మంచి వ్యక్తి అయ్యాడా? అలాంటి వ్యక్తిని ఎలా సభ్యునిగా నియామిస్తారని” ఆయన ప్రశ్నించారు.
జగన్ చేస్తున్న ఈ తప్పును ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకుంటున్నారు. వారు నెరవేర్చిన 99 శాతం హామీలు ఏంటి అనేది ప్రజలకు వివరించాలన్నారు. అధికారంలోకి రావడంతోనే ఉచిత విద్యుత్ గురించి రైతులను ఇబ్బంది పెట్టారు. తరువాత కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యులను ఇబ్బంది పెట్టారు.
అన్నిటికంటే ముఖ్యమైనది ఇసుక దోపిడీ..ఇదివరకటి రోజుల్లో బకాసురులు ఉంటే..ఇప్పుడు జగన్ రాజ్యంలో ఇసుకాసురులు ఉన్నారు. ఇసుక దోపిడీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. అందరికీ అందుబాటులోకి రావాల్సిన పోలవరాన్ని గోదాట్లో ముంచేశారని విమర్శించారు.
మూడు రాజధానులంటూ ఆటలు ఆడారు. కనీసం ఏపీ ప్రజలకు రాజధాని ఏది అంటే ఇది అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఒక్క ఇండస్ట్రీ లేదు.. ఒక్కరికీ ఉద్యోగం లేదు. కానీ జగన్ అండ్ కంపెనీ అందర్నీ దోచుకుని.. తిరుగులేని విధంగా తయారైంది.” అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.