టికెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోతోందా ?

టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందే అన్న తెలంగాణా కాంగ్రెస్ నిబంధన సూపర్ సక్సెస్ అయ్యింది. 119 నియోజకవర్గాల్లో టికెట్లు కావాలంటు సుమారు వెయ్యికిపైగా దరఖాస్తులు అందాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళల్లో ఉన్నారు. రేవంతే దరఖాస్తు చేసుకన్న తర్వాత ఇక మనమంతా ఎంత అని సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోక తప్పలేదు. దాంతో గాంధీభవన్ అంతా దరఖాస్తులతో నిండిపోయింది.

విచిత్రం ఏమిటంటే వచ్చిన దరఖాస్తుల్లో ఒకే నియోజకవర్గంలో కుటుంబసభ్యులు కూడా దరఖాస్తు చేయటమే. తండ్రి-కొడుకులు, భార్య-భర్తలు, తల్లీ-కొడుకులు, అన్నదమ్ములు కూడా ఒకే నియోజకవర్గంలో టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయంటేనే హస్తంపార్టీ నేతలు ఎంత జోష్ తో ఉన్నారో అర్ధమవుతోంది. ఇదంతా కర్నాటకలో గెలుపు మహత్యమనే చెప్పాలి.

ఎప్పుడైతే కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందో అప్పటినుండే తెలంగాణా కాంగ్రెస్ లో ఉత్సాహం పెరిగిపోయింది. అప్పటివరకు బీఆర్ఎస్ కు పోటీ తామే, అధికారంలోకి రాబోయేది తామే అని చెప్పుకున్న బీజేపీ వెనకబడిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత తగులుకోవటం, అరెస్టు ఖాయమనే ప్రచారంతో తెలంగాణాలో ఒకలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే కవిత అరెస్టు జరగదని తేలిపోవటం బీజేపీకి పెద్ద మైనస్ అయిపోయింది. ఎందుకంటే బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందని అందుకనే కవిత అరెస్టు జరగటంలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. దాన్ని జనాలు నమ్మారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణాలో బీజేపీని నిలువునా ముంచేసిందని చెప్పాలి. ఇపుడు బీజేపీ గురించి ఆలోచించేవాళ్ళే లేరు. పార్టీలో చేరాలని అనుకున్న నేతలు కూడా మనసు మార్చుకుని కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇవన్నీ గమనించే కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని నేతల్లో నమ్మకం పెరిగిపోతోంది. అందుకనే దరఖాస్తులు వెల్లువలా గాంధీభవన్ను ముంచేసింది. దరఖాస్తులు తీసుకునేటపుడు కాదు రేపు టికెట్లు ఇచ్చేటప్పుడు ఉంటుంది అసలైన సినిమా. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గానికి సగటున ఏడుగురు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి టికెట్లు ఫైనల్ చేయటం అంత తేలికకాదు.