ఎవరూ దారికి రావటంలేదా ?

రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కనివాళ్ళని బుజ్జగించేందుకు కేసీయార్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న వాళ్ళదగ్గరకు ఎంపీలను, మంత్రులను, సీనియర్ నేతలను రాయబారాలకు పంపుతున్నారు. అయితే అసంతృప్త నేతల్లో ఒకళ్ళు కూడా దారికి రావటంలేదని సమాచారం. ఖమ్మం జిల్లాలో టికెట్ రాని తుమ్మల నాగేశ్వరరావు మండిపోతున్నారు. తుమ్మలతో మాట్లాడేందుకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రయోగించారు. తుమ్మల-నామా మధ్య చాలాసేపు భేటీ జరిగింది.

అయితే ఎంతసేపు భేటీ జరిగినా ఉపయోగంలేకపోయిందట. మద్దతుదారులతో మీటింగని తుమ్మల ఖమ్మం వెళ్ళిపోయారు. మద్దతుదారులేమో వెంటనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని బాగా ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో తుమ్మల చేరితే పాలేరులో టికెట్ ఇవ్వటానికి రెడీగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఇక కొత్తగూడెంలో జలగం వెకటరావుది కూడా ఇదే పరిస్ధితి. టికెట్ రాలేదని పార్టీ వదిలి వెళ్ళొద్దని నేతలు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

స్టషన్ ఘన్ పూర్లో టికెట్ రాలేదని తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజయ్యతో మాట్లాడమని ఎంఎల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి బాధ్యతలు ఇచ్చినా ఉపయోగం కనబడలేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గాన్ని కేసీయార్ పెండింగులో ఉంచారు. దాంతో ఎంఎల్ఏ మధుసూదన రెడ్డి మద్దతుదారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మద్దతుదారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయినా ఉపయోగం కనబడలేదట. మహబూబాబాద్ టికెట్ ను మూడోసారి శంకర్ నాయక్ కు ఇవ్వటంపై పార్టీలోనే బాగా అసంతృప్తి కనబడుతోంది.

శంకర్ గెలుపుకు సహకరించకూడదని అసమ్మతినేతలంతా తీర్మానం చేశారు. దాంతో వాళ్ళతో మాట్లాడే బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు అప్పగించినా ఉపయోగం కనబడలేదు. కోదాడ ఎంఎల్ఏ బొల్లం మల్లయ్య యాదవ్ కు సహకరించేదిలేదని మాజీ ఎంఎల్ఏ చందర్రావు మద్దతుదారులు తీర్మానం చేశారు. వీళ్ళతో మాట్లాడేందుకు జిల్లా నేతలు ప్రయత్నించినా ఫెయిలైంది. టికెట్లను ముందుగా ప్రకటించాలని కేసీయార్ నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగ్గదే. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే మళ్ళీ టికెట్లు ఇవ్వటమే తప్పుగా కనబడుతోంది. మరీ సమస్య నుండి కేసీయార్ ఎలా బయటపడతారో చూడాల్సిందే.