వీళ్లకు బుద్ధి రాలేదు: చంద్రబాబు!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాల అంశంపై మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ప్రజలు ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని గుర్తించాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు.

కొన్ని సార్లు చిన్న కామెంట్ వల్ల ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన ఘటనలు ఉన్నాయని, ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ వల్ల, రైలు ప్రమాదం వల్ల కూడా మంత్రులు రాజీనామా చేసిన దృష్టాంతాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. నైతిక బాధ్యతతో ఆ విధంగా చేశారని వెల్లడించారు.

రాష్ట్రాన్ని ఈ దోపిడీ దొంగలకు వదిలిపెడితే మన భవిష్యత్ అంధకారం అవుతుందని, రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎన్జీటీ కర్రు కాల్చి వాత పెట్టినా వీళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రభుత్వానికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా, ఎన్జీటీ ఆదేశాలపై వెంటనే ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పష్టం చేశారు.

“కానీ, ఇసుక తవ్వకాల విషయంలో ఇన్ని అభ్యంతరాలు, ఇన్ని ఆదేశాలు వస్తే, ఇన్నిసార్లు తప్పుబడితే మీకు బుద్ధి, జ్ఞానం లేదా? అతడికి బుద్ధి, జ్ఞానం లేకపోతే రాష్ట్రంలో ఉన్న మన ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.