వంగవీటి రాధాకృష్ణ ఏమి చేయబోతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాధా ఆలోచనలు ఏమిటనే విషయం ఎవరికీ అంతుబట్టడంలేదు. ఒకసారి జనసేన అదినేత పవన్ కల్యాణ్ తో ఏకాంతంగా భేటీ అవుతారు. మరోసారి వైసీపీ ఎంఎల్ఏ కొడాలి నానీతో సమావేశమవుతారు. దీంతో రాధా రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉందనిపిస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తో రాధా భేటీ అయ్యారు. గన్నవరం నియోజకవర్గంలోని బావులపాడులో లోకేష్ తో రాధా దాదాపు అర్ధగంట మాట్లాడారు.
ఏమి మాట్లాడారు అన్నది తెలీలేదు. చాలాకాలంగా టీడీపీలో రాధా ఎక్కడా కనబడటంలేదు. ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం కనబడరు. అలాంటిది లోకేష్ పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ఎంటరైనపుడు ప్రకాశం బ్యారేజీ దగ్గర స్వాగతం పలికిన నేతల్లో రాధా కూడా ఉన్నారు. లోకేష్ తో పాటు రాధా కూడా కొంచెం దూరం నడిచారు. తర్వాత మూడురోజులు ఎక్కడా కనబడలేదు. అలాంటిది సడెన్ గా బావులపాడు ఏరియాలో ప్రత్యక్షమయ్యారు.
కొంతకాలంగా రాధా జనసేనలో చేరుతారు అనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకసారి పవన్ తో ను మరోసారి నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. దాంతో రాధా జనసేనలో చేరటం ఖాయమైపోయిందనే ప్రచారం పెరిగిపోయింది. ఇక్కడ రాధా సమస్య ఏమిటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలి. అయితే టీడీపీలో అది సాధ్యంకాదు. ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ ఇక్కడ బలమైన అభ్యర్ధిగా ఉన్నారు.
అందుకనే పార్టీమారి జనసేనలో చేరితే తప్ప విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీకి అవకాశం రాదని ఆలోచిస్తున్నట్లున్నారు. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే పొత్తులో సెంట్రల్ నియోజకవర్గాన్ని పవన్ తీసుకుని అక్కడ తనకు టికెట్ ఇస్తారని బహుశా రాధా అనుకుంటున్నట్లున్నారు. అయితే అది జరగటానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ టీడీపీకి స్ట్రాంగ్ సీటని అందరికీ తెలిసిందే. ఈ సీటును వదులుకోవటానికి చంద్రబాబు ఎంతవరకు అంగీకరిస్తారో తెలీదు. బహుశా ఆ విషయం మాట్లాడటానికే లోకేష్ తో రాధా భేటీ అయివుంటారని అనుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates