భయంతోనే పారిపోతుండు: రేవంత్‌ రెడ్డి!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అనే దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కొడంగల్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అందుకుగానూ ఈరోజే దరఖాస్తు ఇస్తున్నట్లు వివరించారు. కొడంగల్‌ అభివృద్ధిని తాను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నట్లు రేవంత్‌ అన్నారు.

కాగా కొడంగల్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో రేవంత్‌ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కాగా, బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ ముఖ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగ్గప్ప, ఎంపీటీసీలు, పలువురు కార్యకర్తలు గురువారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలి అని చూసేవారికి ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతారన్నారు. కొడంగల్‌ ని దత్తత తీసుకుంటామని ఆనాడు కేటీఆర్ ప్రజలను మోసం చేశాడు. హైదరాబాద్-బీజాపూర్ హైవే తెచ్చింది నేను..కొడంగల్ లో కట్టిన గుడి, బడి అన్నీ నా హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే అని పేర్కొన్నారు.

కొడంగల్ కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేను కాదా? అంటూ ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గానికి 30 సబ్ స్టేషన్లు తెచ్చింది మేము..కొడంగల్ ప్రజలకు బస్ డిపో తెచ్చింది మేము…నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మా హయాంలోనే జరిగింది.
బీఆర్‌ఎస్‌ హయాంలో నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్ కి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను చేసిన పనులకు శిలాఫలాకాలు వేయడం తప్ప బీఆర్‌ఎస్‌ చేసింది ఏమి లేదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలు పెంచి కొడంగల్ ను ముక్కలు చెక్కలు చేశారు.కేసీఆర్, కేటీఆర్‌ దత్తత తీసుకుంటే కొడంగల్ కు ఏం జరిగింది? రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్…ఐదేళ్లయినా ఎందుకు తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్ కు నీళ్లు రావు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మీరు దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరు..మీరు చేతితో కొడితే.. ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొడతారు అంటూ పేర్కొన్నారు.

దాడులు చేయడం మా విధానం కాదు… అభివృద్ధి చేయడమే మా విధానం..పేదల జీవన ప్రమాణాలు పెంచి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే మా విధానం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందించడమే మా విధానం. ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం మా విధానం.. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు సాయం చేయడం మా విధానం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకోవడం మా విధానం..కేసీఆర్ ఒడిపోతుండు కాబట్టే గజ్వేల్ నుంచి పారిపోతుండు.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఓటమి ఖాయమైంది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతుండు అంటూ విమర్శించారు. ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుంది… హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. గుర్నాథ్ రెడ్డి సూచనతో నేను కొడంగల్ నుంచే పోటీకీ ఇవాళ గాంధీభవన్ లో దరఖాస్తు చేస్తాం. మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా.. అంటూ పేర్కొన్నారు.