గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. ఆయనను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ ను సమర్పించారని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పై తెలంగాణ హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు.
గురువారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. అంతేకాకుండా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా డీకే అరుణ పోటీ చేశారు. మాజీ మంత్రి డీకే అరుణపై బండ కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు. కృష్ణ మోహన్ రెడ్డి, డీకే అరుణ ల మధ్య బంధుత్వం కూడా ఉంది. కృష్ణ మోహన్ రెడ్డి ఇంతకు ముందు టీడీపీలో ఉండేవారు.
2014 ఎన్నికలకు ముందు కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. 2014లో గద్వాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డీకే అరుణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మరోసారి బండ కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుండి పోటీ చేశారు. మాజీ మంత్రి డీకే అరుణపై బండ కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు.
అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడ తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.