జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటించిన సందర్భం మినహా.. మిగిలిన సమయంలో ఆ పార్టీ స్తబ్దు ఉటుందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత వచ్చినపుడేనా.. మిగిలిన సందర్భాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే కార్యక్రమాల రూపకల్పన ఏది అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రెండు నెలల నుంచి వారాహి యాత్ర పేరుతో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో విస్త`తంగా పర్యటించారు. మూడు విడతల ఆయన యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో వైజాగ్‌ను కవర్ చేశారు. ఆ సమయంలో పతాక స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలతో పత్రికలు నిండిపోయాయి. అదే విధంగా న్యూస్ చానళ్లలోనూ ప్రైమ్ టైంలో చర్చలు జరిగాయి. అయితే వారాహి వాహనంపై కూడా పవన్ వన్‌మ్యాన్ షోలా వ్వహరించారని విమర్శలు కూడా వచ్చాయి. యాత్రలో భాగంగా చేపట్టిన జనవాణి కార్యక్రమంలో మాత్రమే కొందరు ఇతర పార్టీ నాయకులు కనిపించారు. ఏదేమైనా వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిందనే రాజకీయ విశ్లేషకులు భావించారు.
వైజాగ్ పర్యటనతో వారాహి మూడో విడత యాత్ర ముగిసింది. ఆ తర్వాత ఆయన షూటింగ్‌లకు వెళ్లాడని సమాచారం. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి నవంబరు నెల నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిసింది. అయితే.. అప్పటి వరకు క్యాడర్ స్తబ్దుగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై ఉంది. మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి నిమిషం కీలకం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అన్నిచోట్ల వారాహి యాత్రను విజయవంతం చేస్తున్న జనసైనికులు, వీర మహిళలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఈ సమయాన్ని ఎలా వినియోగిస్తారో వేచి చూడాలి..?