‘కేసీఆర్‌ గీసిన గీతను దాటేది లేదు’

స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వెక్కి వెక్కి ఏడ్చారు. మంగళవారం క్యాంపు ఆఫీస్ లో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా బోరున విలపించారు. తరువాత కార్యకర్తలతో కలిసి ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ ముందు పడుకొని వెక్కి వెక్కి ఏడ్చారు.

తరువాత కార్యకర్తలతో మాట్లాడుతూ..కేసీఆర్ తనకు ఉన్నత స్థానం కల్పిస్తామన్నారని అన్నారు. ఇప్పుడున్న స్థానం కంటే మంచి స్థానం తనకు కల్పిస్తానని హామీ ఇచ్చారని.. అధినేత మాటను గౌరవించి తాను ముందుకు సాగుతానన్నారు. ఇక కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని.. ఆయన ఆదేశాలు ఫాలో అవుతానని రాజయ్య స్పష్టం చేశారు.

కాగా, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఈసారి టికెట్ దక్కలేదు. ఇక్కడి నుంచి ఆయన వరుసగా 2014,2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచారు. అయితే ఈసారి ఆ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దక్కింది. జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణల వ్యవహారం రాజయ్యను బాగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.

నవ్య ఎపిసోడ్ రచ్చ.. రచ్చ చేయడం, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇస్తే గెలిపించి చూపిస్తానని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ హైకమాండ్ ఆయన వైపే మొగ్గు చూపింది.

ఈ నేపథ్యంలో మూడోసారి స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలవాలని ముందు నుంచి ఆశలు పెట్టుకున్న రాజయ్య.. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో… తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఏ క్షణంలో అయినా తనకే టికెట్ వస్తుందని అనుకొని భంగ పడ్డారు. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. రాజయ్య కాంగ్రెస్ పార్టీ లేదా బీఎస్పీ లో చేరాలనుకుంటున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.