కామ్రేడ్లను చావుదెబ్బకొట్టిన కేసీయార్

వెయిట్ చేయించి వెయిట్ చేయించి కామ్రేడ్లను మరీ కేసీయార్ చావుదెబ్బ తీశారు. పొత్తుల విషయం ఏమీ తేల్చకుండానే వామపక్షాలను కోలుకోలేని విధంగా కేసీయార్ దెబ్బకొట్టారు. మునుగోడు ఉపఎన్నికలో గెలుపుకోసం వామపక్షాల మద్దతుతీసుకున్నారు. అప్పట్లో వామపక్షాలు కేసీయార్ కు సహకరించకపోతే బీఆర్ఎస్ గెలిచేదే కాదు. ముందుగా ఆ విషయం గ్రహించటం వల్లే వామపక్షాలతో కేసీయార్ సయోధ్య చేసుకున్నారు. నిజానికి అప్పట్లో వామపక్షాలు సహకరించింది రేపటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటానని కేసీయార్ మాట ఇవ్వటంతోనే.

ఈ విషయాన్ని వామపక్షాలు చాలాసార్లు బహిరంగంగానే గుర్తుచేశారు. అయితే ఈమధ్య కాలంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు కేసీయార్ ఏమాత్రం ఇష్టపడలేదు. పొత్తు విషయాన్ని తేల్చుకునేందుకు వామపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీయార్ పడనీయలేదు. అసలు వామపక్షాల నేతలకు అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాంతో పొత్తుల విషయంలో, పోటీచేసే విషయంలో ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఎన్నిసార్లు అడిగినా, డెడ్ లైన్లు పెట్టినా కేసీయార్ లెక్కచేయలేదు.

అప్పుడే అర్ధమైపోయింది వామపక్షాలతో పొత్తుకు కేసీయార్ ఇష్టపడటంలేదని. అదే విషయాన్ని కేసీయార్ సోమవారం తేల్చి చెప్పేశారు. 119 నియోజకవర్గాల్లో 115 చోట్ల అభ్యర్ధులను ప్రకటించేశారు. ఇఫ్పటికైనా వామపక్షాలకు బుద్ధొచ్చుంటుందనే అనుకుంటున్నారు అందరు. జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీల అధినేతలు కేసీయార్ ను ఎందుకు నమ్మటంలేదన్న విషయం తాజాగా మరోసారి బయటపడింది. అవసరానికి ఏదో ఒకటి చెప్పేయటం తర్వాత మాట దాటేసి తనిష్టంవచ్చినట్లు వ్యవహరించటం కేసీయార్ కు బాగా అలవాటు.

విషయం ఏదైనా వామపక్షాలను కేసీయార్ చావుదెబ్బ తీశారన్నది వాస్తవం. ఇపుడు వామపక్షాలు ఏమిచేస్తాయన్నది కీలకంగా మారింది. తమ రెండు పార్టీలకు తలా నాలుగు నియోజకవర్గాలు కేటాయించాలని సీపీఐ, సీపీఎం కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు ఎన్నిసార్లు కేసీయార్ కు సమాచారం పంపించినా పట్టించుకోలేదు. వామపక్షాలకు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాత్రమే కాస్త పట్టుంది. ఏదో బీఆర్ఎస్ మద్దతుతో నాలుగు సీట్లలో గెలవచ్చని వామపక్షాలు ఆశించాయి. అయితే ఇపుడు కేసీయార్ చేసిన పనితో వామపక్షాలు ఆశలు నీరుగారిపోయాయి. ఏదేమైనా వామపక్షాలను కేసీయార్ చావుదెబ్బకొట్టారన్నది వాస్తవం.