మార్గదర్శి చిట్ ఫండ్స్ పై, రామోజీరావుపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే #TeluguPeopleWithRamojiRao ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేయవద్దని సిఐడి అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచించింది. తాము తదుపరి మధ్యంతర ఉత్తరాలు ఇచ్చేవరకు ఈ వ్యవహారానికి సంబంధించి తనిఖీలు, అరెస్టులు చేయవద్దని హైకోర్టు సూచించింది.
ఒకటి రెండు రోజుల్లో తాము మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు ఎటువంటి తనిఖీలు, అరెస్టులు చేయవద్దని ఆదేశించింది. గత కొద్ది రోజులుగా మార్గదర్శికి చెందిన పలు బ్రాంచ్ లలో ఏపీ సిఐడి అధికారులు వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మార్గదర్శికి సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను కొందరిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. ముందు ముందు మరిన్ని కేసులు, అరెస్టులు ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో, మార్గదర్శి కి చెందిన ఒక బ్రాంచ్ మేనేజర్ ను పోలీసులు విడుదల చేశారు. ఆ మేనేజర్ ను రిమాండ్ కు ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. గతంలో కూడా అదే సెక్షన్ పై నిందితుడిని అరెస్ట్ చేశారని ,చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదని అన్నారు. అదే సెక్షన్లతో మళ్ళీ కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పుతో రామోజీరావుకు భారీ ఊరట లభించినట్లయింది.
ఇక, అంతకుముందు తెలంగాణ హైకోర్టులో కూడా ఈ వ్యవహారంపై విచారణ జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తోసిరాజని మార్గదర్శికి చెందిన 1000 కోట్ల ఆస్తులు అటాచ్ చేయడం, తనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంపై మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కోర్టును ఆశ్రయించారు. ఏపీ సిఐడి అధికారులపై, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, కోర్టు ఆదేశాలను ధిక్కరించి నోటీసులు జారీ చేయడం, ఆస్తులు అటాచ్ చేయడం సరికాదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.