నిమ్మకాయల స్టాండ్ బై అభ్యర్ధా ?

Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa

వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా పార్టీవర్గాల సమాచారం అయితే ఇదే. ప్రస్తుతం నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014,19 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ గెలుపుకోసం కష్టపడుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబునాయుడు సామాజికవర్గం సమీకరణలను పరిశీలిస్తున్నారట. ఇందులో భాగంగానే చినరాజప్పను మూడోసారి పెద్దాపురంలో కాకుండా మరో మూడు నియోజకవర్గాల్లో పోటీకి పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక్కడ పాయింట్ ఏమిటంటే కాపుల ప్రాబల్యం ఎక్కడ ఎక్కువగా ఉంటే చినరాజప్పను అక్కడి నుండి పోటీచేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.

దీని ప్రకారం రామచంద్రాపురం, కాకినాడ సిటి, కొత్తపేట నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రామచంద్రాపురంలో బీసీలతో పాటు కాపుల ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీలో మంత్రి చెల్లుబోయిన వెణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు మధ్య వివాదం అందరికీ తెలిసిందే. వీళ్ళ వివాదాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ రాజప్పను పోటీచేయిస్తే టీడీపీ గెలవచ్చని అనుకుంటున్నారట.

అలాగే కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా బండారు సత్యానందరావు ఉన్నారు. జనసేన తరపున ఇన్చార్జిగా సత్యానంద సోదరుడు శ్రీనివాస్ పనిచేస్తున్నారు. వీళ్ళమధ్య చాలా గొడవలున్నాయి. పొత్తున్నా లేకపోయినా వీళ్ళిద్దరు పోటీలో ఉండటం ఖాయమని అనుకుంటున్నారు. అందుకని మధ్యేమార్గంగా సత్యానందరావు స్ధానంలో చినరాజప్పను పంపితే శ్రీనివాసరావు కూడా దారిలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అప్పుడు సోదరులిద్దరినీ రాజప్ప గెలుపుకోసం పనిచేయించుకోవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది.

ఇక కాకినాడ సిటి నియోజకవర్గంలో ఇన్చార్జిగా వనమాడి వెంకటేశ్వరరావున్నారు. అయితే ఈయన పనితీరు ఏమాత్రం బావోలేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ కాపుల ఓట్లు సుమారు 50 వేలున్నాయట. వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మీద వ్యతిరేకత ఉందని దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే చినరాజప్ప అయితేనే బాగుంటుందని చంద్రబాబు అనుకుంటున్నారట. రాజప్ప ప్రస్తుత నియోజకవర్గం పెద్దాపురంలో కమ్మ అభ్యర్ధిని నిలబెడితే ఎలాగుంటుందనే విషయాన్ని కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందుకనే రాజప్పను స్టాండ్ బై అభ్యర్ధిగా ఉంచినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. మరి ఎక్కడినుండి పోటీచేస్తారో చూడాలి.