టికెట్ రాదని ప్రత్యర్థి పర్సనల్ ఫొటోలు లీక్

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలకు అటు ఇటుగా ఇంకో నాలుగు నెలలే సమయం ఉండటంలో ప్రధాన పార్టీల్లో టికెట్ల కేటాయింపుకి సంబంధించిన హడావుడి నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. పనితనం సరిగా లేని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపించి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఆయన టికెట్ నిరాకరిస్తారని భావిస్తున్న ఎమ్మెల్యేల్లో రాములు నాయక్ కూడా ఒకరు. వైరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాములుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలడంతో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్‌‌, బానోతు చంద్రావతి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

కాగా మదన్ లాల్ వైపే కేసీఆర్ మొగ్గుతున్నారని.. ఆయనకు టికెట్ గ్యారెంటీ అని మద్దతుదారులు ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మదన్ లాల్ ఒక మహిళతో రాసలీలలు నడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. ముందుగా వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫొటోలను వైరల్ చేశారు. ఆ తర్వాత అవి ట్విట్టర్, ఫేస్ బుక్‌ల్లోకి కూడా వచ్చేశాయి. ఇది రాములు నాయక్ మద్దతుదారులు చేసిన కుట్రగానే భావిస్తున్నారు.

మదన్ లాల్‌కు టికెట్ గ్యారెంటీ అనే సమాచారంతో ఆయన్ని అన్‌పాపులర్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయనివ్వకుండా చేయాలని వ్యూహం పన్నినట్లుగా భావిస్తున్నారు. ఇవి మార్ఫింగ్ ఫొటోలని.. రాములు నాయక్ వర్గం కావాలనే ఇలా చేసిందని.. మదన్ లాల్‌కే టికెట్ గ్యారెంటీ అని.. అంతే కాక రాములు మీద క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవని ఆయన మద్దతుదారులు అంటున్నారు.