తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చేరికలతో పార్టీలు బిజీ అయిపోయాయి. మరోవైపు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కేసీఆర్.. కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆయన ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే కొంతమంది నాయకులకు టికెట్లు దక్కవనే ప్రచారం సాగుతోంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన బాట పట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దొంటూ, మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చొద్దంటూ ఆందోళనలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయిద్దనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ధర్నా చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఆ టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇక స్టేషన్ ఘన్ పూర్లో పరిస్థితి ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నట్లుగా మారింది. తన నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ రెండు వర్గాల అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్కు మరోసారి టికెట్ ఇవ్వొద్దంటూ అక్కడి నాయకులు మంత్రి హరీష్ రావును కలవడం కలకలం రేపింది. ఇల్లెందు నుంచి మరోసారి హరిప్రియ పోటీ చేస్తే గెలవడం కష్టమని అక్కడి బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. మరి పార్టీలోని నేతల మధ్య ఈ విభేదాలను, తగాదాలను కేసీఆర్ ఎలా తీరుస్తారన్నది ఆసక్తి రేపుతోంది.