జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర మూడు విడతలు ముగిశాయి. తిరిగి నాలుగో విడత ఏ ప్రాంతంలో ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మూడో విడత ఆయన ఈ నెల 10 నుంచి 19వ తేదీల మధ్య విశాఖలో పర్యటించారు. అంతకు ముందు రెండో విడత యాత్ర జూలై రెండో వారంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. తొలివిడత తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.
తొలి రెండు విడతలు తన సామాజిక వర్గానికి, పార్టీకి పట్టు ఉన్న గోదావరి జిల్లాల్లో పర్యటన సాగింది. పవన్ సభలకు విశేష ఆదరణ లభించింది. పవన్ కల్యాణ్ కూడా గతానికి భిన్నంగా కాస్త దూకుడు పెంచి మాట్లాడడంతో రాష్ట్రం మొత్తం రాజకీయ వర్గాల్లో ఓ అటెన్షన్‌ను క్రియేట్ చేశారు. వలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిస్పందనగా రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల ఆందోళనలు.. ఇలా పవన్ తన యాత్రను చర్చనీయాంశంగా మార్చాడు. ఆ మధ్యలో ఎన్‌డీఏ సమావేశానికి హాజరయ్యేందుకు ఢల్లీి కూడా వెళ్లి వచ్చాడు.
ఆ తర్వాత ఉత్తరాంధ్రలో పర్యటించారాయన. ముఖ్యంగా ఏదైతే కాబోయే రాజధాని అని వైసీపీ వర్గాలు చెప్పుకొంటున్నాయో అదే విశాఖలో పర్యటన చేపట్టారు. విశాఖ ఉక్కు వంటి అంశాలను ప్రస్తావించారు. రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాల్లో పర్యటించి వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోనే ఆయన పర్యటిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ తాను ఓడిన గాజువాకలోనూ ఆయన పర్యటించారు. ప్రస్తుతం మూడో విడత యాత్ర ముగిసింది.
అయితే నాలుగో విడత వారాహి విజయయాత్ర ఏ ప్రాంతంలో ఉంటుందో అని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాతంలో ఉంటుందని కొందరు అటుండగా.. రాయలసీమలో ఆయన నాలుగో విడత యాత్ర ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో పవన్ రాయలసీమలో పర్యటించిన సందర్భంలో ఆయనకు జనసైనికుల నుంచి విశేష ఆదరణ లభించింది. అంతే కాకుండా సీఎం ఇలాకాలో పర్యటించి మరింత దూకుడు పెంచాలని జనసేన అధినేత భావిస్తున్నట్లు సమాచారం.