ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలు మొత్తం ముఖ్యమంత్రి పీఠం చుట్టే తిరుగుతున్నాయి. మరోసారి ఆ కుర్చీని కాపాడుకునేందుకు జగన్.. ఎలాగైనా పీఠం ఎక్కేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలనే నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే సీఎంగా ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సభల్లో చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పవన్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని, ఇప్పుడు సీఎం పదవిపై ఆశ లేదని చంద్రబాబు తాజాగా చెప్పారు. ఏపీ భవిష్యత్ కోసమే పోరాడుతున్నానని పేర్కొన్నారు. అందుకు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఒక్కటే మార్గమనే ఉద్దేశంతో మాట్లాడారు. మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవల పవన్ మరోసారి స్పష్టం చేశారు. పవన్, చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త సమీకరణాలు పుట్టుకొస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్కు సీఎం పదవి కావాలి. చంద్రబాబుకు అవసరం లేదు. మరోవైపు పవన్ను సీఎం అభ్యర్థిగా జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ ప్లాన్ వేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు కూడా పవనే సీఎం అభ్యర్థి అని ప్రకటిస్తే.. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుకు మార్గం సుగమమం అవుతుంది. చంద్రబాబు ఆలోచన కూడా అదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ బాబు అలా ప్రకటిస్తే.. టీడీపీలోని సీనియర్ నాయకులు ఒప్పుకుంటారా? అన్నది ఇక్కడ ప్రశ్న. కానీ ఈ మూడు పార్టీలు కలిస్తేనే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉంటాయి. మరి ఈ పార్టీలు టీడీపీతో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.