వరుసగా రెండో సారి ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? అంటే ఇటీవల పరిణామాలు చూస్తుంటే అవుననే పరిస్థితి కలుగుతుందనే చెప్పాలి. పొత్తులు, రాజకీయ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికల్లో ప్రత్యర్థి పార్టీలు ఉండగానే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికలపై జగన్ సీరియస్గా ఫోకస్ పెట్టారనే చెప్పాలి. కొన్ని రోజులుగా జగన్తో పాటు వైసీపీ కీలక నాయకులు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉంటున్నారని తెలిసింది. జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేల పనితీరును పరిశీలిస్తున్నారు. మరోవైపు సచివాలయం ఉద్యోగుల సెలవులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. అంతే కాకుండా మెడికల్ లీవులు కావాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వీవీ పాట్ల తనిఖీల్లో జిల్లా కలెక్టర్లు నిమగ్నమయ్యారని సమాచారం. ఇక తాజాగా జగన్ ఆధ్వర్యంలో వైసీపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా ముందస్తు ఎన్నికలపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. మరో 10 రోజుల్లోనే వైసీపీ అభ్యర్థుల విషయంపై జగన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు సూచనలుగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు బలపడే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates