ఈటెల నిజమే చెబుతున్నారా ?

బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ నిజమే చెబుతున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఈటల ఏమన్నారంటే 22 మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఈనెలాఖరులోగా వాళ్ళంతా బీజేపీలో చేరుతారని చెప్పారు. ఈనెలాఖరులోగా చేరుతారనేందుకు ముహూర్తం ఏమిటి ? ఏమిటంటే 27వ తేదీన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాకు వస్తున్నారు. ఎంతో కాలంగా వాయిదాలు పడుతున్న ఖమ్మం బహిరంగసభ జరగబోతోంది.

అమిత్ తెలంగాణా రాకసందర్భంగా 22 మంది పెద్దనేతలు బీజేపీలో చేరటానికి రంగం సిద్ధమైందని ఈటల అన్నారు. 22 మంది నేతలు ఎవరు ? ఏ పార్టీలో నుండి వస్తున్నారు ? అన్న విషయాన్ని చెప్పలేదు. బీజేపీ టార్గెట్ అంతా బీఆర్ఎస్సే కాబట్టి అధికారపార్టీలో నుండి రావచ్చనే చర్చ పెరిగిపోతోంది. వివిధ కారణాల వల్ల బీజేపీలో చేరబోతున్న వాళ్ళ వివరాలను రహస్యంగా ఉంచినట్లు ఈటల చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ అంతమంది బీజేపీలో చేరటం నిజమేనా అనే డౌటు పెరిగిపోతోంది.

ఎందుకంటే ఇపుడు తెలంగాణా రాజకీయమంతా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే అన్నట్లుగానే ఉంటోంది. ఒకపుడు బీజేపీకి మంచి ఊపుండేది కానీ కొద్దినెలలుగా పార్టీ చప్పబడిపోయింది. ఎప్పుడైతే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందో అప్పటినుండే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ కు ఊపు ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రముఖులు అనుకున్న చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరారు. దాంతో బీజేపీ బాగా వెనకబడిపోయింది.

నిజానికి మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొంటారని అనుకునేంతమంది అభ్యర్ధులు 40 నియోజకవర్గాల్లో ఉంటే చాలా గొప్ప. సంస్ధాగతంగా బలపడలేదు, నేతలను చూసినా బలమైన వాళ్ళు చాలా తక్కువ, అధికారంలోకి వస్తుందన్న నమ్మకమూ లేదు. పైగా పార్టీకి ఊపుతెచ్చిన బండి సంజయ్ ను తీసేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు. ఈ పరిస్ధితుల్లో బీజేపీలో 22 మంది నేతలు ఎందుకు చేరుతారు అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈటల ఏదో గాలిమాటలు చెప్పే రకంకాదని అందరికీ తెలుసు. మరి నెలాఖరులో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.