ఒంటి చేత్తో ఎంత దూరం? : చంద్ర‌బాబు ఒక ఆత్మావ‌లోక‌నం

ఎంత‌టి నాయ‌కులైనా.. గ‌తం తాలూకు అనుభ‌వాల‌ను, లెక్క‌ల‌ను త‌ర‌చుగా ప‌రిశీలించుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి తేడా లేదు. గ‌తం అనేక పాఠాలు, లెక్క‌లు నేర్పిస్తుంద‌ని అంటారు. అలాగే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏం జ‌రిగిందో ఒక్క‌సారి మ‌న‌నం చేసుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దాని తాలూకు పాఠాల‌ను ప్ర‌స్తుత కాలానికి వ‌ర్తింప జేయాల‌నే సూచ‌న‌లు కూడా వ‌స్తున్నాయి.

2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధికారంలో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల‌ను స‌రైన విధంగా డీల్ చేయ‌లేక‌పోయార‌నే వాద‌న టీడీపీలోనే వినిపించింది. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించే బాద్య‌త‌ను సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబు వేసుకున్నారు. అంతేకాదు.. ప్ర‌తి ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గానికీ వెళ్లి.. త‌న వాళ్ల‌ను గెలిపించాల‌ని విన్న‌వించారు. తన నేత‌లు త‌ప్పు చేస్తే.. ఈ ఒక్క‌సారికీ త‌న‌ను చూసి ఓటేయాల‌ని వంగి వంగి మ‌రీ ద‌ణ్ణాలు పెట్టారు.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు-టీడీపీకి మ‌ధ్య కెమిస్ట్రీ పండ‌లేదు. క‌ట్ చేస్తే.. సేమ్ టు సేమ్‌.. ఇప్పుడు కూడా అదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌తి నియోజ‌వ‌క‌ర్గంలోనూ చంద్ర‌బాబే బాధ్య‌త తీసుకుంటున్నార‌ని.. కానీ, స్థానిక నేత‌కు ఎందుకు బాధ్య‌త అప్ప‌గించ‌డం లేద‌నేది ప‌రిశీల‌కుల ప్ర‌శ్న‌. స్థానికంగా ఉన్న నాయ‌కుడిని చూసే ప్ర‌జ‌లు ఓటేస్తార‌ని.. ఆ నాయ‌కుడిలో ఏ చిన్న తేడా వున్నా.. క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.

ఇలాంటి కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో మెజారిటీ వ‌ర్గంగా నాయ‌కుల‌ను ముందు దింపి.. చంద్ర‌బాబు ర‌థం న‌డిపిస్తే.. బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల మాదిరిగా చంద్ర‌బాబును చూసి ఓటే యాల‌ని ఇప్పుడు కూడా పిలుపునిస్తున్నార‌ని, ఇలా కాకుండా.. త‌న నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. పార్టీని గెలిపించి తీసుకురావాల‌నే ష‌ర‌తును వారికే అప్ప‌గిస్తే.. బెట‌ర్ అని.. త‌ద్వారా పార్టీపై నాయ‌కుల బాధ్య‌త పెరిగి.. మ‌రింత దూకుడుతో పార్టీ ముందుకు సాగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.