జూపల్లి ఆశలపై నాగం నీళ్లు

బీఆర్ఎస్పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ పై విమర్శలు చేసి.. పార్టీ నుంచి బయటకు వెళ్లారు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూరులో భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్లో చేరాలనుకున్నారు. కానీ అది వీలు కాలేదు. చివరకు ఢిల్లీ వెళ్లి కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొల్లాపూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతే కాకుండా తన అనుచరులకూ టికెట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడు జూపల్లికి నాగం జనార్ధన్ రెడ్డి ఎదురు తిరగడం చర్చనీయాంశంగా మారింది.

ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఒక్కసారిగా ఫైరయ్యారు. జూపల్లిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నానని మాజీ మంత్రి కూడా అయిన నాగం పేర్కొన్నారు. అలాగే కొల్లాపూరులోనూ నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అక్కడి నాయకులు కాపాడుతున్నారని చెప్పారు. ఇప్పుడు జూపల్లి వచ్చి అయిదు సీట్లు కావాలని అడిగడం సరికాదని నాగం అసహనం వ్యక్తం చేశారు.

కొత్తగా కాంగ్రెస్లో చేరిన జూపల్లి కోసం ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న నాయకులకు అన్యాయం చేయొద్దనే ఉద్దేశంతో నాగం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూరుతో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల తదితర అయిదు నియోజకవర్గాల్లో తన అనుచరల కోసం సీట్లు కావాలని జూపల్లి అడుగుతున్నారని నాగం పేర్కొన్నారు. గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోకవర్గం నుంచి పోటీ చేసిన నాగం జనార్ధన్ రెడ్డి.. బీఆర్ఎస్ నేత మర్రి జనార్ధన్ రెడ్డి చేతిలో ఓడారు. ఈ సారి పోటీపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని నాగం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్లో చక్రం తిప్పుదామనుకున్న జూపల్లి ఆశలకు నాగం అడ్డుగా నిలుస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.