ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి సీనియర్ల వరకు అందరూ క్రమశిక్షణతో ముందుకు సాగి.. పార్టీని డెవలప్ చేయాలని, అధికారంలోకి తీసుకురావాలని పెద్ద ఎత్తున కష్ట పడుతున్నా రు. అయితే.. బెజవాడలో మాత్రం కేశినేని బ్రదర్స్ ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటు.. సొంత పార్టీలోనే ఎగస్పార్టీ కుంపట్లు పెట్టుకుని కాలం వెళ్ల బుచ్చుతున్నారనే వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తు న్నాయి.
తాజాగా.. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర త్వరలోనే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిదిలోకి అడుగు పెట్టనుంది. అయితే. ఇదే కార్యక్రమం వేదికగా.. కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని వర్గాలు రోడ్డున పడ్డాయి. బ్యానర్లు కట్టే విషయంలో టీడీపీ నాయకులు కరిముల్లా, పడాల వాసులు రోడ్డున పడి ఒకరికొకరు కొట్టుకున్నారు. ఇక, ఈ వివాదంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం.
మొన్న కేశినేని నాని వర్గంగా, నిన్న కేశినేని చిన్ని వర్గంగా ఆయన ఉన్నారని, ఈ గొడవలకు గద్దె కారణ మయ్యారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా మాట్లాడుకొంటున్నారు. టీడీపీ బలంగా ఉందని చెప్పుకొనే విజయవాడలో సీనియర్లు ఇలా ఇగోలకు పోయి.. పార్టీ పరువును బజారున పడేయడం ఎంత వరకు సమంజసమని అంటున్నారు తమ్ముళ్లు.
ఇదిలావుంటే, మరోవైపు, విజయవాడ పార్లమెంటు పరిధిలో పాదయాత్రను విజయవంతం చేసే బాధ్యతలను పార్టీ అధిష్టానం కేశినేని చిన్నికి అప్పజెప్పింది. ఇది మరింతగా వివాదాలకు దారితీసిందని అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు చిన్ని వ్యవహారంలో చూడనట్టే వ్యవహరించిన పార్టీ.. ఇప్పుడు నేరుగా ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎంపీని సైడ్ చేసినట్టేనా? అనే చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.