గ‌వర్న‌ర్‌కు అడ్డంగా చిక్కిన కేసీఆర్‌.. !

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి-రాష్ట్ర స‌ర్కారు అధినేత కేసీఆర్‌కు మ‌ధ్య ఉన్న వివాదాలు.. విద్వేషాలు అంద‌రికీ తెలిసిందే. గ‌త మూడేళ్లుగా కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. కేవ‌లం హైకోర్టు ప్ర‌ధాన న్యాయ మూర్తి ప్ర‌మాణ స్వీకారంలో త‌ప్ప‌.. మిగిలిన ఏ కార్య‌క్ర‌మానికి కూడా ఇరువురు క‌లిసి పాల్గొన్న‌ది లేదు. త‌న‌కు క‌నీసం ప్రొటోకాల్ కూడా అమ‌లు చేయ‌డం లేద‌ని గ‌వ‌ర్న‌ర్‌, త‌మ బిల్లుల‌ను తొక్కి పెడుతూ.. అప్ర‌క‌టిత పాల‌న చేస్తున్నార‌ని అధికార ప‌క్షం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు కూడా చేసుకున్నాయి.

ఇదిలావుంటే.. గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యం నుంచి మ‌రింత‌గా త‌మిళిసైకి-కేసీఆర్‌కు మ‌ధ్య వివాదాలు ముదిరాయి. అప్ప‌టి నుంచి కూడా రాజ్‌భ‌వ‌న్‌-సీఎంవోల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష రాజ‌కీయ దుమారం కొన‌సాగుతోంది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి గ‌వ‌ర్నర్‌తో సీఎం కేసీఆర్‌కు అవ‌సరం ఏర్ప‌డింది. కాంగ్రెస్ వ‌ల‌స నాయ‌కుడు దాసోజు శ్రవణ్‌, బీజేపీ నుంచి జంప్ చేసిన‌ కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలను చేసి.. మ‌రింత మంది జంప్ అయ్యేలా చూద్దామ‌ని కేసీఆర్ ప్లాన్ వేశార‌ట‌.

అయితే, గ‌తంలో పాడి కౌశిక్ రెడ్డి విష‌యంలో ఏ విధంగా అయితే , గ‌వ‌ర్న‌ర్ మోకాల‌డ్డారో.. ఇప్పుడు వీరి విష‌యంలోనూ గవర్నర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావ‌డంతో ఆమె ప‌చ్చ‌జెండా ఊపాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. గ‌తంలో పాడి కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయ‌నే కారణంగా ఆయ‌నను నామినేట్ చేసేది లేద‌ని గ‌వ‌ర్న‌ర్ తేల్చి చెప్పారు. దీంతో ఆయ‌న‌ను ఎమ్మెల్యే కోటాలో మండ‌లి పంపారు కేసీఆర్‌.

ఇక‌, ఇప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంటుందా? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. దాసోజు శ్రవణ్ రాజకీయ నేత, కుర్రా సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే. ఈ కారణాలతో వారి పేర్లను గవర్నర్ ఆమోదించడం లేదనే ప్ర‌చారం అయితే తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కోసం ఎదురు చూడ‌డం త‌ప్ప‌.. సీఎం కేసీఆర్ చేయాల్సింది ఏమీ లేద‌ని.. మేధావులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ మ‌రోసారి అడ్డంగా చిక్కారే అనే కామెంట్లు చేస్తున్నారు.