కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎలాంటి సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టెండర్ల ద్వారానే గంధమల్ల రిజర్వాయర్ పనులు వచ్చాయని, భూ సేకరణ వల్ల ఆ పనులు ఆలస్యం అయ్యాయని వెల్లడిచారు.
ఎలాంటి పదవి వద్దంటున్న కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిదని, అందుకు ఇదే సరైన సమయమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్దంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు గాలి మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మభ్యపెడతారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న నలుగురు నేతలు తామంటే తాము పీసీసీ చీఫ్లంటూ కొట్టుకుంటున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో పీసీసీ ఒక మాట చెబితే మరోనేత వ్యాఖ్యలు దానికి విరుద్దంగా ఉంటాయన్నారు. ఆ పార్టీలోని నేతల్లోనే ఐక్యతలేదన్న గుత్తా.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న 2 లక్షల రూపాయల రుణామాఫీ అసాధ్యమన్నారు.
ప్రజలను తమవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సాధ్యం కాని హామీలను ఇస్తుందన్న ఆయన.. వాటిని ప్రజలు గమనించాలని సూచించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ లోపే పూర్తవుతుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates