ఆ దేశంలో దేశాధ్యక్షుడ్ని.. ప్రధానిని నిర్బంధించిన సైన్యం

వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. దేశాధ్యక్షుడ్ని.. ప్రధానమంత్రిని సైన్యం నిర్బంధంలోకి తీసుకోవటమే కాదు.. పలువురు ప్రభుత్వ నేతల్ని ఏకాఏకిన లోపలేసేసిన సంచలనం తాజాగా మాలిలో చోటు చేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో సైనికులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. కొద్ది రోజులుగా దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో సైన్యం వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

దేశాధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్ కీతా.. ప్రధాని బూబౌ సిస్సేలనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఐక్య రాజ్యసమితి స్పందించింది.దేశ ప్రజలు సంయమనం పాటించాలని.. తక్షణమే ప్రభుత్వ అధినేతల్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సైనిక దుశ్చర్యను ఆఫ్రికా సమాఖ్య ఛైర్మన్ మౌస్సా ఫకీ మహమత్ ఖండించారు. మాలిలో చోటు చేసుకున్న పరిణామాలపై మహమత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తాజాగా మాట్లడుతూ.. దేశాధ్యక్షుడ్ని భేషరతుగా విడుదల చేయాలని.. దేశ సమగ్రతను కాపాడే విషయంలో ప్రజాస్వామ్య సంస్థలను మౌలి పౌరులు గౌరవించాలని కోరారు. దేశంలోని పలువురు అధికారపక్ష నేతల్ని.. ఉన్నత స్థాయి అధికారుల్ని అరెస్టు చేసినట్లుగా రష్యా మీడియా పేర్కొంది.

సైనిక తిరుగుబాటుకు మొత్తం నలుగురు సైన్యాధికారులు నాయకత్వం వహిస్తున్నారని.. మాలి రాజధాని బమాకోకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే సైనిక పట్టణం కతిలో నెలకొన్న అశాంతి.. చివరకు తాజా పరిస్థితులకు కారణంగా మారిందని చెబుతున్నారు. అక్కడి ఆయుధగారం నుంచి ఆయుధాలు తీసుకున్న సైనికులు తొలుత కొద్దిమంది అధికారుల్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అధ్యక్ష నివాసానికి వెళ్లి.. దాన్ని చుట్టుముట్టి.. దేశాధ్యక్షుడ్ని నిర్బంధించారు. సైనిక చర్యను ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు స్వాగతించటం గమనార్హం.

దేశ ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. దేశాధ్యక్షుడు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా సైనికులు రంగంలోకి దిగిన సైన్యం.. దేశాధ్యక్షుడి నివాసం వైపు కాల్పులు జరుపుతూ తిరుగుబాటు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయటం.. ఆ తర్వాత నుంచి దేశాధ్యక్షుడు బూబకర్ పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. తాజాగా ఇది కాస్తా సైనిక చర్యగా రూపాంతరం చెందటం గమనార్హం.