విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జనవాణి’కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాధితుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే అనకాపల్లి జిల్లాలో బాలిక కిడ్నాప్ పై కుటుంబ సభ్యులు జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్.. బాలిక కిడ్నాప్ వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు ఎక్కువగా కిడ్నాప్ కు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికలే ముఖ్యంగా మిస్ అవుతున్నారని చెప్పారు. ఈ కిడ్నాప్ వ్యవహారలపై ఫిర్యాదులు చేస్తే.. విత్ డ్రా చేసుకోవాలని సంబంధిత వ్యక్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పవన్ తెలిపారు. అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఎప్పటి నుంచో కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయని గుర్తు చేశారు.
పోలీసు శాఖ ఎందుకు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రిట్ పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకోమంటున్నారని నిలదీశారు. వీరి వెనక వైసీపీ నేతలు ఉన్నారా? అని నిలదీశారు పవన్ కళ్యాణ్. బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోబోమన్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు పవన్.
అలాగే దివ్యాంగుల స్కూల్ యజమాని సైతం జనవాణి కార్యక్రమంలో ఓ ఫిర్యాదు చేశారు. తాను ఉషోదయ జంక్షన్ జీవీఎంసీ స్థలంలో కొంత భాగాన్ని లీజ్ కు తీసుకొని దివ్యాంగుల స్కూల్ నడిపిస్తున్నానని.. అయితే దీనిపై వైసీపీ నేతలు తనను వేధిస్తున్నారని చెప్పారు. తన స్కూల్ ని కరోనా సమయంలో మూసి వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పిల్లల కోసం ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నానన్నారు. వైసీపీ నేతల వేధింపుల కారణంగా 200 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆ స్కూల్ యాజమాన్యం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన పవన్.. ఆ స్కూల్ ని మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు.