ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తూంటే విపక్ష నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్ చూసి ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన అంటున్న మాటలు వింటుంటే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంటేనే ఆయనకు నచ్చేటట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. బుధవారం జనసేనాని విశాఖ ఎర్రబట్టిదిబ్బలను సందర్శించిన తరువాత మాట్లాడిన మాటల పై వైసీపీ మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పర్యటనలు చేసుకోండి మిమ్మల్ని ఎవరూ కాదు అనరు. కానీ అభివృద్ధి చేస్తున్న వాటి గురించి విమర్శలు మాత్రం చేయకండి.ఎందుకంటే మీకు విమర్శించే స్థాయి లేదు. ప్రభుత్వాన్ని , ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటే మాత్రం ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
ఎర్రమట్టి దిబ్బలు చారిత్రక ఆనవాళ్లు వాటిని వైసీపీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని పవన్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. అక్కడ వీఎంఆర్డీవో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పా అంటూ పవన్ ని ప్రశ్నించారు.
గత నాలుగైదు రోజులుగా పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నప్పటికీ ఒక్క కుంభకోణాన్ని కూడా నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని అమర్నాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కి కొన్ని ముఖ్య సూచనలు చేశారు..” మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ కాకుండా వాస్తవాలు తెలుసుకోని అవగాహన పెంచుకుని అప్పుడు ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడాలి” అని అమర్నాథ్ పవన్ కి హితవు పలికారు.