వాళ్ల‌కు టికెట్లు.. వీళ్ల‌కు ప‌ద‌వులు!

తెలంగాణ‌లో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన సీఎం కేసీఆర్‌.. ఆ దిశ‌గా ముమ్మ‌ర క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఓ వైపు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి పెట్టిన ఆయ‌న‌.. మ‌రోవైపు ప్ర‌జ‌ల ముందుకు వెళ్లేందుకు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కూ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అభ్య‌ర్థుల ఎంపిక ఇప్ప‌టికే దాదాపుగా కొలిక్కి వ‌చ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే 80 మంది అభ్య‌ర్థుల‌తో ఆయ‌న తొలి జాబితా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. అయితే టికెట్‌పై ఆశ‌తో ఉన్న కొంత‌మంది నాయ‌కుల‌కు ఈ సారి కేసీఆర్ అవ‌కాశం ఇచ్చేలా లేరు. అందుకే వీళ్ల‌ను బుజ్జ‌గిస్తున్నార‌ని తెలిసింది.

ముఖ్యంగా తెలంగాణ‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన చాలా మంది నేత‌లు ఆ త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలాంటి నాయ‌కులున్నారు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టికెట్లు ద‌క్కే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిన బీఆర్ఎస్ నేతలు, పార్టీలోని కీల‌క నాయ‌కులు టికెట్లు ఆశించినా ఈ సారి భంగ‌పాటు త‌ప్పేలా లేదు. అందుకే ఇలాంటి నాయ‌కులు అసంతృప్తి చెంద‌కుండా కేసీఆర్ బుజ్జ‌గింపు చ‌ర్య‌ల‌కు దిగార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇస్తాన‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టికెట్లు ద‌క్క‌ని నాయ‌కుల‌కు ప‌ద‌వులు క‌ల్పిస్తాన‌ని కేసీఆర్ చెబుతున్న‌ట్లు తెలిసింది. ఈ మేర‌కు ఆయా నాయ‌కుల‌తో కేసీఆర్ మాట్లాడార‌ని స‌మాచారం. ముందుగా ఇలాంటి నేత‌ల‌తో కేటీఆర్, హ‌రీష్ రావు చ‌ర్చించి ఓ దారికి తెస్తున్న‌ట్లు టాక్‌. వీళ్లు చెప్పినా విన‌క‌పోతే అప్పుడు కేసీఆర్ రంగంలో దిగుతున్న‌ట్లు చెబుతున్నారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్ద‌రు నాయ‌కుల‌తో కేసీఆర్ ఇటీవ‌ల చ‌ర్చించి పార్టీ మార‌కుండా చూశార‌ని స‌మాచారం. మొత్తానికి ఈ బుజ్జ‌గింపులు ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి ఫ‌లితాల‌నే ఇస్తున్నాయ‌ని అంటున్నారు.