సీఎం పదవిపై ఆశ లేదంటూనే ఆ కుర్చీకి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి గాలం వేస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఈ ఎంపీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం కుర్చీపై, మంత్రి పదవిపై ఆశ లేదని తాజాగా వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద ప్లానే ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన వ్యవహార శైలి, మాటలు అందుకు అనుగుణంగానే సాగుతున్నాయి. ఇక యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, భువనగిరి నియోజకవర్గ ఇంఛార్జీగా ఉండే అనిల్ కుమార్ కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోమటిరెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర కూడా తన మనసులోని మాటను బయటపెట్టినట్లు తెలిసింది.
సీఎం పదవిని ఆశించే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారనే అభిప్రాయం రాకుండా ఉండేందుకు ముందే ఆయన జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎం కుర్చీపై ఆశ లేదన్నారు. అంతే కాకుండా మంత్రి పదవీ వద్దంటున్నారు. కానీ రేప్పొద్దున ఎన్నికల్లో టికెట్ వచ్చి.. ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడు మాత్రం సీఎం పదవి కావాలనే వాళ్లలో కోమటిరెడ్డి ముందుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టికెట్ వచ్చేంతవరకే ఆయన ఈ విధంగా మాట్లాడతారని చెబుతున్నారు. మరి కాంగ్రెస్ ఆయన్ని ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపుతుందో లేదో చూడాలి.