కర్నూలు జిల్లాలో కీలకమైన స్థానం పత్తికొండ. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో కంగాటి శ్రీదేవి విజయం దక్కించుకున్నారు. సీఎం జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రకటించిన ఫస్ట్ టికెట్ ఇదే కావడం గమనార్హం. ఇక్కడ నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్ కుమార్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో శ్రీదేవి అనూహ్యమైన విజయం దక్కించుకున్నారు.
ఏకంగా 43 వేల ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఓకే.. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ నాలుగే ళ్ల కాలంలో ఎమ్మెల్యేగా మాత్రం ఆమె గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అంతా సొంత వారి పెత్తనం, అల్లుడి దూకుడుతో.. పార్టీలోని నేతలే కంగాటికి వ్యతిరేకంగా కూటమి కట్టారు. ఈ పరిణామాలతో కంగాటికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్నాళ్లుగా ఆమెకు టికెట్ ఇవ్వద్దంటూ.. వైసీపీ నాయకులే డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది.
అయితే.. తాజాగా వైసీపీ ఐటీ విభాగం ఇచ్చిన జాబితాలో పత్తికొండ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నిక ల్లో కూడా కంగాటికే సీటు కన్ఫర్మ్ చేశారు. ఇదే కనుక వాస్తవం అయితే.. కర్నూలులో వైసీపీ కోరి కోరి ఓడి పోయే సీటు ఇదేనని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. జిల్లాలో అత్యంత దారుణంగా ఓడిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎందకంటే గత ఎన్నికల సమయంలో ఆమె భర్త హత్య కొంత సింపతిని మోసుకువచ్చింది.
కానీ, ఈ నాలుగేళ్లలో ఆమె ప్రవర్తనను గమనించిన ప్రజలు.. ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పత్తికొండలో కంగాటి విజయం సాధించకపోగా.. డిపాజిట్లు దక్కితే సేఫేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో వైసీపీ పునరాలోచన చేస్తుందో లేక.. కంగాటికే టికెట్ ఇస్తుందో చూడాలి.