కేసీయార్ ఎందుకు తప్పుకున్నారు ?

ఇపుడి విషయంపైనే ప్రభుత్వ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆరోగ్యశ్రీ ట్రస్టు ఛైర్మన్ బాధ్యతలనుండి కేసీయార్ తప్పుకున్నారు. వరంగల్ కు చెందిన డాక్టర్ సుధాకరరరావుకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ ట్రస్టు నియమ, నిబంధనలకు కేసీఆర్ నిర్ణయం విరుద్ధం. అయినా సరే ఎందుకు తప్పుకున్నారు ? ఎందుకని డాక్టర్ సుధాకర్ కు బాధ్యతలు అప్పగించారు ? ఆరోగ్యశ్రీ ట్రస్టు ఏర్పాటైన దగ్గర నుండి ముఖ్యమంత్రి మాత్రమే ఛైర్మన్ గా ఉన్నారు.

సమైక్య రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణలో అయినా ఇదే పద్ధతి కంటిన్యూ అవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అంటే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీయార్ మాత్రమే ట్రస్టు ఛైర్మన్ గా వ్యవహరించారు. అలాంటిది ట్రస్టు నియమ, నిబంధలను ప్రక్షాళన చేసి, ట్రస్టు బైలాస్ ను పునర్ వ్యవస్ధీకరించింది ప్రభుత్వం. సుధాకర్ ను ఛైర్మన్ గా చేయటానికే ప్రభుత్వం ఇలాంటి పనిచేసిందనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రస్టు తరఫున ఏదన్నా కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే మామూలు వ్యక్తులకు అవకాశం లేదు. ట్రస్టు తరపున నిర్ణయం తీసుకున్నా దాని ఆమోదం కోసం మళ్ళీ ఫైలును ముఖ్యమంత్రికి పంపాల్సిందే. అదే ముఖ్యమంత్రే ఛైర్మన్ గా ఉంటే ట్రస్టు సమావేశంలో ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని డైరెక్టుగా అమల్లోకి తెచ్చేయచ్చు.

ఈ ఉద్దేశ్యంతోనే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కేసీయార్ కూడా ఛైర్మన్ గా ఉన్నారు. అలాంటిది సడెన్ గా మొత్తం బైలాస్ ను ఎందుకు మార్చారు ? సుధాకర్ ను ఎందుకు ఛైర్మన్ గా నియమించారో అర్ధంకావటంలేదు. ప్రభుత్వం చేసిన పనివల్ల ఏమైందంటే మంత్రులు, ఎంఎల్ఏలు చేసే సిఫారసులు ఆమోదం పొందాలంటే ఛైర్మన్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి చుట్టు తిరగమంటే తిరుగుతారు. మరిపుడు ఛైర్మన్ చుట్టూ కూడా తిరగాలంటే మంత్రులు, ఎంఎల్ఏలకు కాస్త ఇబ్బందే. మొన్నటివరకు వరంగల్లో డాక్టర్ గా పనిచేసిన సుధాకర్ ను ఛైర్మన్ చేయటంతో తలెత్తబోయే సమస్యిది.