వైసీపీ కన్నా మంచి పథకాలు తెస్తా: పవన్

2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించకపోతే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు రావని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే, టిడిపి, జనసేనలకు ఓటు వేయకూడదని, వైసిపినే మరోసారి గెలిపించి జగన్ ను సీఎం చేయాలని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఇక, వాలంటీర్లు కూడా పరోక్షంగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లిస్ట్ అవుట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీని గెలిపించుకుంటే పథకాలు రావన్న భయం అక్కరలేదని, జనసేన అధికారంలోకి వస్తే ఇంకా మంచి పథకాలు తీసుకువస్తుందని పవన్ స్పష్టతనిచ్చారు.

జనసేన వీర మహిళలతో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశమైన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనకి అండగా నిలబడాలని, యువత భవిష్యత్తుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు జనసేన భరోసానిస్తుందని చెప్పారు. సీఎం స్థాయిలో ఉన్న జగన్ ఒక ప్రాంతానికి కులాన్ని అంటగట్టి మాట్లాడుతున్నారని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పవన్ నిప్పులు చెరిగారు. 38 కేసులన్న జగన్ కోర్టు తీర్పులను తప్పు పడుతున్నారని, రుషికొండ వంటి వాటిని ధ్వంసం చేస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 30 వేల మంది మహిళల అదృశ్యం పెద్ద విషయమని, రేప్ చేస్తామని మహిళలను బెదిరించే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ రకంగా ఉన్నాయో అర్థం అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో జనసేన తరఫున త్వరలోనే ప్రజా కోర్టు కార్యక్రమం చేపట్టబోతున్నామని, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం ఉంటుందని, సందర్భానుసారంగా కొన్నిసార్లు బయట ఈ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. తప్పు చేసిన వారికి ప్రజా కోర్టులో ఏ ఏ చట్టాల కింద శిక్ష పడాలి, రాజ్యాంగ ఉల్లంఘన ఎలా జరుగుతుంది అన్నదానిపై ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. తాడేపల్లి ప్రాంతంలో క్రైమ్ రేట్ అత్యధికంగా ఉందని, అటువంటి వాటిపై మహిళా కమిషన్ స్పందించదని మండిపడ్డారు.