ఏపీ సీఎం జగన్.. కొన్నాళ్ల కిందట వరకు ఎక్కడ పర్యటించినా.. మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజధానులపై కోర్టుల్లో కేసులు పడడం.. వాటిపై కొన్ని వ్యతిరేక తీర్పులు రావడం.. దీంతో సుప్రీం కోర్టులో సర్కారు సవాలు చేయడం తెలిసిందే. దీంతో ఏం మాట్లాడితే ఏమవుతుం దోననే ఉద్దేశంతో జగన్ ఆ తర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు.
అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం మరోసారి మూడు రాజధానుల విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తొలుత సాయుధ దళాలు సీఎం జగన్‌కు గౌరవ వందనం సమర్పించాయి. ప్రత్యేక వాహనంపై సీఎం పెరేడ్ ను పరిశీలించా రు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని పేర్కొంటూ 13 అభివృద్ధి శకటాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. “ఆనాడు భారతంలో సైంధవుడు ఉండేవాడట. అయినా జరగాల్సిన న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధవులు ఉన్నారు. మూడు ప్రాంతాలకు మంచి జరగకూడదనివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయమే గెలుస్తుంది. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నాం“ అని జగన్ అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో 50 నెలల్లో చేసి చూపించామన్నారు. ఏ ప్రభుత్వమూ చేయని గొప్ప మార్పులు చేశామన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం , మహిళ సాధికారత, సామాజిక న్యాయం, పారిశ్రామిక రంగంలో అనేక కీలక మార్పులు తీసుకువచ్చామని.. రాష్ట్రం అన్ని విధాలా పురోగమిస్తోందని సీఎం జగన్ వివరించారు.