77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. అయితే.. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మధ్యతరగతిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం విశేషం. నిజానికి ఎర్రకోటపై నుంచి ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ప్రసంగించినా.. ఎప్పుడూ పథకాలు ప్రకటించలేదు.
పైగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రసంగాలు లేనేలేవు. కానీ, అన్నింటికీ.. అందరికీ భిన్నంగా వ్యవహరించే ప్రధాని మోడీ.. ఇప్పుడు కూడా తన రికార్డును అలానే కొనసాగించారు. వచ్చే రెండు మాసా ల్లో మధ్యతరగతి ప్రజలు కలలుగనే ఇంటి నిర్మాణానికి సంబంధించి లేదా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల కొనుగో లుకు సంబంధించి కీలకమైన పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు లేని విధంగా ఈ పథకం ద్వారా అనేక రెట్లు ప్రయోజనం ఉంటుందన్నారు.
లక్షల రూపాయల్లో మధ్యతరగతికి మేలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని తెలిపారు. పన్నులు కడుతూ.. దేశ ప్రగతి, పురోగతిలో భాగస్వాములైన మధ్యతరగతి వర్గాన్ని విస్మరించలేమని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే.. వారి జీవిత కాల స్వప్నమైన ఇంటి విషయంలో త్వరలోనే కీలకమైన ప్రభుత్వ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అయితే.. పేరు, ఇతర విషయాలను మాత్రం ఈ వేదికగా ప్రధాని వెల్లడించలేదు. కానీ, ఇలా స్వాతంత్య్ర దినోత్సవాన.. ఒక వర్గాన్ని ఆకర్షించేలా ప్రకటన చేయడం మాత్రం ఇదే తొలిసారి.