టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనూహ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రత్యక్షమయ్యారు. నిన్న మొ న్నటి వరకు ఏపీలో పర్యటించిన ఆయన అకస్మాత్తుగా హిమాచల్ ప్రదేశ్‌లో కనిపించడం.. సతీసమేతంగా ఆయన అక్కడ ఉండడం వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాస్తవానికి ఆదివారం కూడా చంద్రబాబు ఏపీలోనే ఉన్నారు. టీడీపీ కార్యకర్తలపైనా.. నాయకులపైనా జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రధాని, రాష్ట్రపతులకు ఆయన లేఖ సంధించారు.
సోమవారం నాటికి వచ్చేసరికి చంద్రబాబు హిమాచల్ లో కనిపించారు. అది కూడా సతీసమేతంగా కావడం గమనార్హం. దీంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. వ్యాహ్యాళి కోసం.. వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత.. సతీసమేతంగా చంద్రబాబు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారని అంటున్నాయి. ఇదిలావుంటే.. ఈ పర్యటనలో భాగంగా.. బీజేపీ నాయకుడు, గవర్నర్ బండారు దత్తాత్రేయతో చంద్రబాబు భేటీ అయ్యారు.
దీంతో ఈ పర్యటనకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడింది. రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంటకు పైగా చంద్రబాబు.. గవర్నర్ దత్రాత్రేయుడితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా ముఖ్యంగా వచ్చే ఎన్నికల విషయంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉండడం.. ఎన్నికలకు మరో నాలుగు మాసాలే గడువు ఉండడంతో బాబు-దత్తాత్రేయల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.