బీసీ బంధు.. తెలంగాణలో ఎంబీసీలతో పాటు 14 బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ఘనంగా ప్రకటించిన పథకం. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ప్రకటన అయితే ఘనంగానే చేశారు.. కానీ అమలు మాత్రం సవ్యంగా లేదనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. అర్హులను అధికారులు గుర్తించినా.. ఎమ్మెల్యేల ఒత్తిడి కారణంగా నిధులు పంపిణీ చేయలేకపోతున్నారని సమాచారం.
బీసీ బంధు కింద కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇస్తామని ప్రకటించగానే బీసీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆ రూ.లక్ష కోసం జూన్‌లో 5.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో నుంచి 4.2 లక్షల మంది అర్హులుగా అధికారులు తేల్చారు. జూన్ 15 నుంచి ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి రూ.లక్ష చొప్పున సాయం అందించాలని అనుకున్నారు. కానీ ఆ తేదీన చాలా జిల్లాల్లో పంపిణీ ప్రారంభించలేకపోయారు. కొన్ని జిల్లాల్లోనేమో 50 నుంచి 100 మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిసింది.
దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను ప్రభుత్వం.. బీసీ సంక్షేమ శాఖ ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. వీళ్లు జాబితా సిద్ధం చేశారు. కానీ ఇందులో ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తుల పేర్లు లేవని సమాచారం. పథకానికి అనర్హులుగా తేలడంతో చాలా మంది పేర్లను జాబితా నుంచి తీసేశారు. ఇందులో ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులు ఉండడం ఇప్పుడు సమస్యగా మారింది. తాము సూచించిన వారిని ఎందుకు తొలగించారంటూ అధికారులను ఆ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. జాబితాలో వాళ్ల పేర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు అర్హులేమో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులున్నారని తెలిసింది.