బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి.. పూలమ్మిన, పాలమ్మిన, కష్టపడ్డా, సక్సెస్ అయిన అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఇదే డైలాగ్ కొడుతున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లే కనిపిస్తోంది. మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనులు చేయడం లేదని, ఎందుకు నియోజకవర్గంలో తిరుగుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
2014లో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి 2018లో మేడ్చల్ ఎమ్మెల్యే అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు మల్లారెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో తిరిగి నియోజకవర్గానికి వస్తున్నారని, ప్రజల సమస్యలు, ఇబ్బందులు పట్టని ఆయన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సీసీ రోడ్డు శంకుస్థాపన కోసం వెళ్లిన మల్లారెడ్డిని కాచవాని సింగారం గ్రామం ప్రజలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. బీసీ భవనం నిర్మించాల్సిన స్థలంలో సీసీ రోడ్డు ఎలా వేస్తారని మంత్రిని నిలదీయడంతో ఆయన వెనుదిరిగారు.
తాజాగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి పర్యటనను స్థానికులు అడ్డుకున్నారు. గతంలో గ్రామాల్లో సమస్యలు పరిష్కారించాలని మల్లారెడ్డిని కోరామని, కానీ పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులతో మాట్లాడి సర్దిచెప్పేందుకు మల్లారెడ్డి ప్రయత్నించారు. కానీ గ్రామస్థులు వినకపోవడంతో మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల వరకూ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మల్లారెడ్డికి కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates