అప్పుడు జ‌గ‌న్‌.. ఇప్పుడు కేటీఆర్‌..

2019 ఎన్నిక‌ల‌కు మందు జ‌గ‌న్ లాగే.. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆలోచిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్రంలో చ‌క్రం తిప్పుతామ‌ని ఇటీవ‌ల కేటీఆర్ త‌ర‌చూ చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో వ‌చ్చేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మేన‌ని, అందులో బీఆర్ఎస్ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని కేటీఆర్ అంటున్నారు. అంతే కాకుండా త‌మ‌కు న‌చ్చిన వాళ్ల‌ను ప్ర‌ధానిగా ఎంపిక చేసుకోవ‌చ్చ‌ని, ఆ అధికారం పార్టీకి వ‌స్తుంద‌ని కూడా కేటీఆర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని కేసీఆర్ బ‌లంగా చెబుతున్నారు. స‌రే.. ఆయ‌న మాట‌ల ప్ర‌కారం సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే వ‌స్తే అందులో బీఆర్ఎస్ ఎలా కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న‌. తెలంగాణ‌లో 17 ఎంపీ సీట్లున్నాయి. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ కేవ‌లం 9 స్థానాల్లో మాత్ర‌మే గెలిచింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌రో సీటు త‌గ్గుతుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. మ‌రి కేవ‌లం 8 ఎంపీ స్థానాల‌తో కేంద్రంలో బీఆర్ఎస్ చ‌క్రం ఎలా తిప్ప‌గ‌ల‌దు?

మ‌హారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాల‌ని, అప్పుడు కేంద్రం మెడ‌లు వ‌చ్చే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని పార్టీ అధినేత కేసీఆర్ చెబుతున్నారు. కానీ అది సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. మ‌రి అత్తెస‌రు సీట్ల‌తో కేంద్రంలో బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుంద‌న్న‌ది కేటీఆర్‌కే తెలియాలి. మ‌రోవైపు 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ కూడా ఇలాగే కేంద్రంలో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తామ‌ని అన్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీకి 25కి గాను 22 ఎంపీ సీట్లు ద‌క్కాయి. మ‌రి వైసీపీ ఏమైనా సాధించిందా? అంటే అదీ లేదు. ఎంపీల‌ను గెలిపించండి.. ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని అప్పుడు జ‌గ‌న్ అన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ముందు త‌ల‌వంచుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.