మొత్తానికి వైఎస్సార్టీపీ అదినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి అవసరమైన వేదిక ఏర్పాటైపోయిందని సమాచారం. కర్ణాటక నుండి షర్మిలను రాజ్యసభకు ఎంపిక చేయటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందట. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతోంది. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి హోదాలో ఏపీకి ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవాలన్న అగ్రనేతల సూచనకు షర్మిల కూడా ఓకే చెప్పారట. సో, అన్నీ విషయాలు ఓకే అయిపోయాయి కాబట్టి ఇక విలీనం ఒకటే మిగిలింది.
ఇంతకాలం వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే షర్మిల భవిష్యత్తు, రాజకీయం ఏమిటనేది సస్పెన్స్ గా ఉండిపోయింది. దీనిపైనే చాలాకాలం చర్చలు జరిగాయి. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్టానం తరపున షర్మిలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా చర్చల్లోకి ఎంటరయ్యారు. వేణు సీన్లోకి ఎంటరైన తర్వాత విలీనం వ్యవహారం స్పీడందుకన్నదట.
మొదట్లో తాను తెలంగాణాలోనే ఉంటానని ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీకి లేదా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తానని షర్మిల గట్టిగా చెప్పారని సమాచారం. ఏపీకి ఎట్టి పరిస్ధితుల్లోను వెళ్ళేది లేదని కచ్చితంగా చెప్పేశారట. అధిష్టానమేమో షర్మిలకు ఏపీలో యాక్టివ్ చేయించాలని అడుగుతున్నది. అయితే ఏపీలో తనకున్న ఇబ్బందుల కారణంగా తాను తెలంగాణాకే పరిమితవ్వాలని అనుకుంటున్నట్లు షర్మిల చెప్పారు. అందుకనే మధ్యేమార్గంగా డీకే, కేసీ ఒక ప్రపోజల్ పెట్టారట.
అదే కర్నాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అవ్వటం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించటం, ఏపీ బాధ్యతలు తీసుకోవడం. దీనికి షర్మిల కూడా ఓకే చెప్పారట. కాబట్టి ఇక మిగిలింది విలీనం ఎప్పుడనే. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ ఇన్చార్జంటే షర్మిల చేయాల్సిందేమిటి అనే విషయమై స్పష్టత రావటంలేదు. ఏ రూపంలో ఏపీ కాంగ్రెస్ లోకి ఎంటరైనా షర్మిల చేయాల్సిందయితే సోదరుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించటమే కదా. మరి జగన్ను వ్యతిరేకించి కాంగ్రెస్ కు మళ్ళీ షర్మిల జీవం పోయగలరా ? అన్నదే అసలైన ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates