తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మరో రెండు నెలల్లోపే ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ విజయ వ్యూహాల్లో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక.. ప్రచార ప్రణాళికలపై దృష్టి సారిస్తున్నాయి. మరోవైపు ఇదే అదునుగా తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై పోరాటానికి వివిధ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలకు ముందే సరైన సమయమంటూ.. ఇప్పుడైతేనే డిమాండ్లు నెరవేర్చుకోగలమనే అభిప్రాయంతో ధర్నాలకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు ప్రజల ఆదరణ పొందాలన్నా.. ఓట్లు ఖాతాలో వేసుకోవాలన్నా.. వ్యతిరేకత తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ ఆయా వర్గాల డిమాండ్లకు ఓకే అంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో లేని పోని తలనొప్పి ఎందుకని ఎవరు ఏది అడిగినా ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడమే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో.. గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవడంలో ఇబ్బంది ఉందని, అందుకే వాయిదా వేయాలని నిరుద్యోగార్థులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్షను వాయిదా వేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, పోడుభూముల పట్టాల పంపిణీ, ఆర్టీసీ కార్మికుల విలీనం, వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడం, రైతు రుణమాఫీ వంటి నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇతర వర్గాలు కూడా సిద్ధమవుతున్నాయి. తాజాగా సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనకు తెరలేపారు. దీంతో సరిగ్గా టైం చూసుకుని కేసీఆర్‌పై ఒత్తిడి పెంచుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates