టీడీపీతో టచ్ లో బొత్స కుటుంబ సభ్యులు?

వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన, టీడీపీ ఉండవని, ఒకవేళ ఆ రెండు పార్టీలు అప్పటికే ఉంటే తాను గుండు కొట్టించుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆ పార్టీలకు లేదని, ఎన్నికలప్పుడే వాటికి స్కీములు గుర్తుకు వస్తాయని బొత్స విమర్శలు గుప్పించారు. చెప్పుతో కొడతామని పవన్ వంటి నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందించిన బొత్స…చెప్పులు అందరికీ ఉంటాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స వ్యాఖ్యలపై  టీడీపీ నేత బోండా ఉమా ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో బొత్సతోపాటు ఆయన సోదరులు, కుటుంబ సభ్యులను చిత్తుగా ఓడిస్తామని ఉమ ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాదు, వైసీపీ నుండి బొత్స కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు…మొత్తం 50 మంది తమతో టచ్ లో ఉన్నారని బోండా ఉమ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీపై బొత్సకు అంత నమ్మకం ఉంటే ఉగాది వరకు కాదని ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని, ప్రజలు వైసీపీ పాలనతో విసుగెత్తిపోయారని బోండా ఉమ విమర్శించారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

అంతకుముందు, పవన్ పై బొత్స సంచలన విమర్శలు చేశారు. జనసేన విధానం ఏమిటి? ఎజెండా ఏమిటి అనే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ వద్ద సమాధానం లేదని బొత్స విమర్శలు గుప్పించారు. పార్టీ పెట్టి 15 ఏళ్లయినా సంస్థాగత నిర్మాణంపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని బొత్స అన్నారు. వాలంటీర్లపై కూడా పవన్ మాట మార్చారని, అసలు పవన్ స్టాండ్ ఏమిటో చెప్పాలని బొత్స నిలదీశారు. పవన్ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలు అంటేనే అసహ్యం వేస్తోందని బొత్స వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు.