కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను జమ చేశారు. ఆయన మాట్లాడుతూ కోటీ 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందని చెప్పారు. రూ.1,353.76 కోట్ల వడ్డీని రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా 4,969.05 కోట్లను మహిళల ఖాతాలకు బదిలీ చేసినట్లు చెప్పారు.
గత ప్రభుత్వంలో అక్కాచెల్లెమ్మలను మోసం చేశారని, బాబు హయాంలో రూ.14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని సీఎం జగన్ ఆరోపించారు. మహిళలను గత ప్రభుత్వం రోడ్డున పడేసిందని, నాటి బకాయిలను తాము చెల్లించామని చెప్పారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదేనని సీఎం జగన్ అన్నారు. 2016లో సున్నా వడ్డీ పథకాన్నిచంద్రబాబు రద్దు చేశారని, వడ్డీని మాఫీ చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుందని అన్నారు.
పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీభారం పడకూడదని అన్నారు సీఎం జగన్. మహిళల జోవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ చేస్తున్నామన్నారు. అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశామన్నారు.
ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం తీసుకొచ్చాం. పేద పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశాం. పేదరికం నుంచి బయటపడాలంటే చదువే ఆయుధమని పునరుద్ఘాటించారు సీఎం జగన్.