కేసీయార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారా ?

షెడ్యూల్ ఎన్నికలకు తగ్గట్లుగా కేసీయార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. పోయిన ఎన్నికల డేట్ ప్రకారమైతే  డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సుంటుంది. కేంద్ర ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారమైతే జనవరిలో ఎన్నికలు జరుగుతాయి. ఏదైనా నెలరోజుల వ్యవధిలో ఎన్నికలు జరగటమైతే ఖాయమన్నట్లే. అందుకనే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏల కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. అదేమిటంటే రాబోయే మూడు నెలలు మంత్రులు, ఎంఎల్ఏలు అందరు జనాల్లోనే ఉండాలని ఆదేశించార.

అంటే ఇది ఏపీలో జగన్మోహన్ రెడ్డి దాదాపు ఏడాదికాలంగా అమలుచేస్తున్న గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం లాంటిదే అనుకోవచ్చు. తొమ్మిదేళ్ళల్లో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సాధించిన ప్రగతి, సంక్షేమపథకాలను జనాలకు వివరించాలట. సంక్షేమ పథకాలన్నీ అర్హులైన జనాలకు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎంఎల్ఏలందరు ప్రతి ఇంటికి తిరిగి తెలుసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా అర్హతలుండి మిస్సయితే వెంటనే వాళ్ళ పేర్లను జాబితాలో చేర్చి వచ్చేనెల నుండే వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందేట్లు చూడాల్సిన బాధ్యత ఎంఎల్ఏలదే అని చెప్పారట.

పార్టీలోని నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటు అందరినీ కలుపుకుని ఎన్నికల్లో గెలిచి తీరాలని కేసీయార్ అందరికీ స్పష్టంగా చెబుతున్నారట. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీపై జనాల్లో కచ్చితంగా వ్యతిరేకత ఉంటుందని దాన్ని ఎంత వీలైతే అంత తగ్గించగలిగితేనే గెలుపు అవకాశాలు పెరుగుతాయని అందరికీ చెబుతున్నారట. నియోజకవర్గాల్లో తిరిగినపుడు ఎంఎల్ఏలు స్ధానిక సమస్యల పరిష్కారాలకు చొరవచూపించాలని చెప్పారట.

జనాల్లోని వ్యతిరేకతను ఎంఎల్ఏలు తట్టుకుని నిలబడాలన్నారు. సమస్యలంటే ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం తదితరాలుంటాయని కూడా కేసీయార్ ఎంఎల్ఏలకు చెబుతున్నారట. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల వల్ల జరిగిన, జరగబోయే నష్టాలను కూడా వివరించమని చెప్పారట. నరంద్రమోడీ పాలనలో దేశం పడుతున్న ఇబ్బందులను వివరించమని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ పాలనలో దేశం ఎంత ఆగమైపోయిందో కూడా వివరించి చెప్పాలని ఎంఎల్ఏలకు కేసీయార్ పదేపదే చెబుతున్నారట. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు తిరిగితే మళ్ళీ గెలుపు బీఆర్ఎస్ దే అని కేసీయార్ బల్లగుద్ది చెబుతున్నారు.