క‌ష్టంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు ఆదుకున్నారు..: ఉండ‌వ‌ల్లి శ్రీదేవి

వైసీపీ నుంచి కొన్నాళ్ల కింద‌ట స‌స్పెన్ష‌న్‌కు గురైన ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ ఎమ్మెల్యే, డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి తాజాగా హాట్ కామెంట్లు చేశారు. క‌ష్టంలో ఉన్న‌ప్పుడు.. వైసీపీ గూండాలు త‌న‌పై దాడికి దిగిన‌ప్పుడు.. క‌న్న కూతురు మాదిరిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆద‌రించార‌ని చెప్పారు. త‌న‌కు నారా లోకేష్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ ద‌న్నుగా నిలిచి, ధైర్యం చెప్పార‌ని అన్నారు. వైసీపీ గూండాల దాడి నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌స్తుతం తాను తెలంగాణ‌లోనే ఉంటున్న‌ట్టు చెప్పారు.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ విష‌యంపై ఇంకా ఆలోచించ‌లేద‌న్న ఉండ‌వ‌ల్లి.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే చెబుతాన‌న్నారు. తాజాగా ఆమె టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. సుమారు గంట‌పాటు ఆమె స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌తో పాటు పార్టీలో చేరిక‌పైనా చ‌ర్చించారు. అదేవిదంగా ప్ర‌స్తుతం గుంటూరులోని పెద‌కూర‌పాడులో సాగుతున్న నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర త్వర‌లోనే ఉండ‌వ‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లోకి ప్ర‌వేశించ‌నుంది.

ఈ నేప‌థ్యంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను హిట్ చేసే అంశంపైనా చంద్ర‌బాబుతో ఆమె చ‌ర్చించార‌ని తెలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీదేవి..‘‘నేను కష్టాల్లో ఉన్న‌ప్పుడు టీడీపీ అధినేత‌ చంద్రబాబు, లోకేష్ లు .. నేను ఏ పార్టీ నుంచి గెలిచాన‌నే విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా నాకు మాన‌సికంగా ధైర్యం చెప్పారు. అన్ని విష‌యాల్లోనూ మద్దతిచ్చారు. వైసీపీ గుండాలు నామీద దాడులు చేశారు“ అని అన్నారు.

అంతేకాదు.. మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రిగితే.. జ‌గ‌న్ వ‌స్తార‌ని చెబుతున్న నాయ‌కులు.. దిశా చట్టం అమ‌ల‌వుతోంద‌ని చెబుతున్న అధికార పార్టీ నేత‌లు.. త‌న‌పై దాడులు చేసిన‌ప్పుడు.. దిశ చ‌ట్టం ఏం చేసింద‌ని ఆమె నిప్పులు చెరిగారు. రానున్న రోజుల్లో ఏ పార్టీ లో జాయిన్ అవుతానో ఆలోచించాన‌ని, దీనికి గాను తాను నాలుగున్నర నెలలపాటు ఆలోచన చేశాన‌న్నారు. త‌న‌ నిర్ణయాన్ని త్వరలోనే చెబుతాన‌ని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు. కాగా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఉండ‌వ‌ల్లి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.