కేంద్రంతో కలిసి జగన్ రెడ్డిని ఓ ఆట ఆడిస్తా.. అంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర 3.0లో భాగంగా ఆయన విశాఖపట్నంలోకి రద్దీ కూడలి జగదాంబ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వారాహి వాహనంపై నుంచే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సర్కారు సహా వైసీపీ నాయకులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్ మద్దతుదారులందరి జాబితా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. దోపిడీ దారుల బండారం బయటపడే రోజు దగ్గర్లోనే ఉంది. జగన్.. కేంద్రంతో కలిసి నిన్ను ఆటాడించకపోతే చూడు” అని పవన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. విశాఖ జిల్లా సంఘ విద్రోహశక్తుల అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయన్నారు.
దివాలా తీసిన బైజూస్ కంపెనీకి రూ.500 కోట్లు ఇచ్చారని సీఎం జగన్ సొంత సొమ్మా? ప్రజల కష్టార్జితమా? అని పవన్ నిలదీశారు. విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను రూ.25వేల కోట్లకు తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని అన్నారు. “పరిశ్రమలు వస్తే నాకేంటి.. ఎంత వాటా? అని అడుగుతారు. ఎంత డబ్బు తింటావు.. వేల కోట్లు ఏం చేసుకుంటావు” అని పవన్ ప్రశ్నించారు. జగన్ నాయకుడు కాదు.. వ్యాపారి అని పేర్కొన్నారు. మద్యంపై 30 వేల కోట్లు ఆర్జించారని చెప్పారు. జగన్‌కు మరో అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అన్నా అని పిలిచి..
“ముఖ్యమంత్రి జగన్ వైఖరి భిన్నంగా ఉంటుంది. వాత పెట్టేముందు.. ఆయన చక్కగా చిరునవ్వుతో అన్నా అని పిలుస్తాడు. దానిని నమ్మితే.. జైలుకు వెళ్లడమే” అని పవన్ అన్నారు. “రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెబితే.. వైసీపీ నేతలంతా నాపై విరుచుకుపడ్డారు. నేను చెప్పిన తర్వాత పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించింది. వాలంటీర్లపై నాకు ద్వేషం లేదు. కానీ, మీ ద్వారా డేటా సేకరించిన తీరు రాజ్యాంగ విరుద్ధం. సీఎం జగన్.. అన్నా.. అక్కా.. అంటూ అధికారులను సంబోధిస్తుంటారు. సీఎం.. అన్నా అని పిలిచాడని పొంగిపోయి తప్పులు చేస్తే ఆ తర్వాత జైలుకు వెళ్లడమే” అని పవన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates