జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటినస్తోన్న సంగతి తెలిసిందే. మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచి మొదలుపెట్టబోతున్నారు పవన్ కల్యాణ్. వారాహి యాత్రలో తొలి, రెండో విడత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దిగ్విజయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ ఊపుతో మూడో విడత యాత్రను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చెందిన కీలక మహిళా నేత జనసేనలో చేరారు.
టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి పడాల అరుణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దసపల్లా హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పడాల అరుణకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని, అందుకే జనసేనలో చేరానని అన్నారు. పవన్ నిర్ణయాలు, ఆలోచనలు తనకు నచ్చాయని చెప్పారు. గజపతినగరం నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచారు. చంద్రబాబు హయాంలో మంత్రి పని చేశారు. రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేసిన అరుణ…తాజాగా జనసేనలో చేరారు.
ఈ రోజు విశాఖ జగదాంబ సెంటర్ నుంచి వారాహి యాత్ర మొదలుకానుంది. 14వ తేదీ దాకా విశాఖలో పవన్ ఉండి 15, 16 తేదీల్లో యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. 17 వ తేదీ నుంచి యాత్రను మళ్లీ ప్రారంభిచనున్నారు. అయితే, పవన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ముందు నిర్ణయించిన రూట్ లో కాకుండా ఎయిర్ పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని సూచించారు. రోడ్‌షో నిర్వహించొద్దని, అభివాదాలు వద్దని ఆంక్షలు విధించారు.